గ్రాస్ కోర్ట్ కిరీటం ఎవరిదో…?
టైటిల్ పోరుకు సిధ్ధమైన లిసికి
బర్తోలి
లండన్ ,జూలై 5 (జనంసాక్షి):
ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ తుది అంకానికి చేరుకుంది. శనివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో ఫ్రాన్స్ క్రీడాకారిణి మరియన్ బర్తోలీ , జర్మనీ సెన్సేషన్ సబైన్ లిసికి తలపడనున్నారు. కెరీర్‌లో తొలిసారిగా గ్రాండ్‌శ్లామ్ ఫైనల్‌కు చేరుకున్న సిలికి టైటిల్ సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. టోర్నీ ప్రారంభం నుండి వరుస విజయాలతో దూసుకొచ్చిన ఈ జర్మన్ బ్యూటీ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనాకు షాకిచ్చింది. ఏ గ్రాండ్‌శ్లామ్‌లోనైనా నాలుగో రౌండ్ వరకూ చేరుకోవడమే ఆమె కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ స్పూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ లిసికి తన కెరీర్‌లో 3 డబ్ల్యూటిఎ టైటిళ్ళు , 2 ఐటిఎఫ్ టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుత వింబుల్డన్‌లో ఈ యంగ్ ప్లేయర్ చక్కని ఆటతీరు కనబరుస్తోంది. సెరెనాపై విజయం ఆమె కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచిందనే చెప్పాలి. ఎందుకంటే తర్వాతి మ్యాచ్‌లలో లిసికి ఆటతీరే దీనికి ఉదాహారణ. సెవిూస్‌లో రడ్‌వాన్‌స్కాపై అద్భుతంగా పోరాడింది. భారీ సర్వీసులతో నాలుగో సీడ్‌కు చెక్ పెట్టింది. ఇదే జోరు ఫైనల్లోనూ కొనసాగిస్తే కెరీర్‌లో మొదటి గ్రాండ్‌శ్లామ్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో లిసికి 24వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు కెరీర్‌లో రెండోసారి వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్న ఫ్రాన్స్ ప్లేయర్ మరియన్ బర్తోలీ కూడా మంచి ఫామ్‌లో ఉంది. 15వ సీడ్‌గా ఆడుతోన్న బర్తోలీ ఫైనల్‌కు చేరుకునే క్రమంలో కనియా కనేపీ , ఫ్లిప్‌కిన్స్ , స్టీఫెన్స్ లాంటి యంగ్ ప్లేయర్స్‌ను ఓడించింది. 2007లో రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ఈ ఫ్రాన్స్ భామ ఈ సారి మాత్రం టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తద్వారా కెరీర్‌లో తొలి గ్రాండ్‌శ్లామ్ గెలుచుకోవాలని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో కొనసాగుతోన్న బర్తోలీ ఫోర్ హ్యాండ్ , బ్యాక్‌హ్యాండ్ షాట్లను కొట్టడంలో దిట్ట. అయితే సంచలనాలతో దూసుకొచ్చిన లిసికిని ఓడించడం అంత ఈజీ కాకపోవచ్చు. అయినప్పటకీ… అనుభవం ప్రకారం బర్తోలీదే పైచేయిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తం విూద ఈ సారి వింబుల్డన్ ఎవ్వరు గెలిచినా అభిమానులు కొత్త ఛాంపియన్‌ను చూడనున్నారు.