గ్రూఫ్-2 పరీక్షలకు సర్వ సిద్ధం
నెల్లూరు, జూలై 18: ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మొత్తం మీద 14,100 మంది అభ్యర్థులు హాజరు అవుతుండగా వీరి కోసం 37 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటలవరకు, 22 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ తెలిపారు. పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 విధించాలని కలెక్టర్ సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.