గ్రేహౌండ్స్‌ మరింత..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి): పోలీసుశాఖలోని గ్రేహౌండ్స్‌ విభాగం మరింత పటిష్టం కానుంది. మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిరోధించడంలో కీలక భూమిక నిర్వహిం చిన ఈ విభాగాన్ని శక్తివంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రైఫిల్స్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం ఈ మేరకు మూడున్నర కోట్ల రూపాయలు విడుదల చేస్తూ, గ్రేహౌండ్స్‌ పటిష్టానికి చర్యలు చేపట్టాలని డీజీపీ దినేష్‌రెడ్డిని సర్కార్‌ ఆదేశించింది. అత్యంత

శక్తివంతమైన ఈ ఆయుధాలు అందితే దేశంలో ఆర్మీ తరువాత వీటిని కలిగి ఉన్న పోలీసు విభాగం మనదే అవుతుంది. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ విభాగంలో ఏకే 47, 56, ఇతర ఆయుధాలు వినియోగిస్తున్నారు. అయితే కూంబింగ్‌ ఆపరేషన్లు, ఎదురుకాల్పుల ఘటనలకు సంబంధించి ఏకేలు, లేదా లైట్‌ వెయిట్‌ మిషన్‌గన్‌లు వినియోగిస్తున్నప్పటికీ వాటి బరువు అధికంగా ఉండటంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఆయుధం, నడుముచుట్టూ ఉన్న బుల్లెట్లు, భుజాన కిట్‌ బ్యాగ్‌లతో ఒక్కో గ్రేహౌండ్స్‌ కమెండో దాదాపుగా 21 నుంచి 29 కేజీల బరువు దాకా మోయాల్సి వస్తోంది.  అయితే కొత్తగా కొనుగోలు చేయబోతున్న పీఎస్‌జీ1ఏ1 రైఫిల్‌ బరువు ఏకేతోనూ, ఇతర తుపాకులతోనూ పోలిస్తే చాలా తక్కువ (రైఫిల్‌, కిట్‌ బరువు సుమరు ఏడున్నర కిలోలు) బరువు ఉండటంతో పాటు దాదాపు ఆరు నుంచి ఏడు వందల మీటర్ల దూరం వరకు గురి తప్పకుండా కాల్చే అవకాశం ఉంది. ఇందు కోసం ఆపరేషన్‌లో పాల్గొంటున్న కమెండో ఏ మాత్రం కష్టపడకుండా శత్రువును గమనించేందుకోసం దీనికి అత్యంత అధునాతనమైన టెలిఫోటో లెన్స్‌ అమరి ఉంటాయి. దీంతో సురక్షిత ప్రాంతంలో ఉన్న కమెండో  అక్కడి నుంచి కదలకుండానే ఏడు నుంచి 8 వందల మీటర్ల దూరంలో ఉన్న శత్రువు కదలికలను చాలా స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది.  అదే విధంగా అవి సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ కావడంతో అవసరం అయినప్పుడు  20 నుంచి 40 బుల్లెట్ల వరకు ఆగకుండా దూసుకుపోయే విధంగా బరస్ట్‌ ఫైర్‌ సౌకర్యం కూడా ఉంటుంది.  అలాగే ఈ రైఫిల్స్‌కు ట్రిగ్గర్‌ లాక్‌తోపాటు రౌండ్స్‌ లాక్‌ కూడా ఉండటంతో కూంబింగ్‌ సమయంలోనూ, లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడో ప్రమాదవశాత్తు పేలి బుల్లెట్లు దూసుకుపోయే అవకాశం ఎంతమాత్రం ఉండదు. పది నిమిషాలు దీనిని వినియోగించకపోతే ఈ రెండు లాక్‌లు వాటంతట అవే మూసుకుపోతాయి. వీటిని తిరిగి ఓపెన్‌ చేసే సమయంలో సాధారణ తుపాకుల నుంచి వచ్చినట్లుగా కాకుండా చాలా తక్కువ స్థాయిలో కేవలం క్లిక్‌ మన్న శబ్దం బైటకు వస్తుంది. ప్రస్తుం బీఎస్‌ఎఫ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలలో కూంబింగ్‌లో పాల్గొంటున్న సీఆర్‌పీఎఫ్‌ దళాలు వీటిని వినియోగిస్తున్నట్టు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వాటి పనితీరు పరిశీలించిన తరువాతే గ్రేహౌండ్స్‌ దళాలకు వీటి అవసరం చాలా ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కార్‌ స్పందించి చర్యలు చేపడుతోంది. అలాగే ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళనలు జరుగుతున్న సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌సిబ్బంది గాయపడకుండా ఉండేందుకోసం దాదాపు 90 లక్షల రూపాయల వ్యయంతో వివిధ రకాల బాడీగార్డ్‌ పరికరాలు కొనుగోలు చేయాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా రాళ్లదాడి నుంచి కాపాడుకునేందుకు పటిష్టమైన హెల్మెట్లు, మోచేతులు, కాళ్లకు గాయాలు తగలకుండా కాపాడుకునేందుకు ఉద్దేశించిన పరికరాలు కొనుగోలుకు నిర్ణయించారు. వీటి కొనుగోలు  కోసం 90 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కొనుగోలు  చేయబోతున్న హెల్మెట్‌ల పై భాగంలో అవసరమైన పక్షంలో రహస్య కెమేరాలు కూడా అమర్చుకునే సౌకర్యం ఉంది. దీనిలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ చిప్‌లో 16 జీబీ దృశ్యాలను స్టోరేజ్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.