*ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు*

*బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్*

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను శనివారం బీచుపల్లి పదో బెటాలియంలో కమాండెంట్ రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ రామ్ ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు స్వాతంత్రంకు ముందు బ్రిటిష్ పాలన తరువాత నిజాంనిరంకుశ పాలనలో ఎన్నో సంవత్సరాలు మగ్గిపోయారన్నారు. 1947లో భారతదేశం మొత్తం స్వాతంత్రాన్ని పొందిన తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు అన్నారు. నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో కలవనీయకుండా స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించగా అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో నిజాం నవాబును ఒప్పించి హైదరాబాద్ ను భారత యూనియన్ లో  కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, ఆర్ఐలు  రాజేష్, రమేష్ బాబు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంతో పాటు షేక్ పల్లి బి.వీరాపురం ఆర్. గార్లపాడు,  సాసనూలు, పుటాన్ దొడ్డి, కోదండపురం, జింకలపల్లి, పెద్దదిన్నె, సాబాద, చాగాపురం తదితర గ్రామాలలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల దగ్గర జాతీయ జెండాలను ఆవిష్కరించారు.