ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

– రాష్ట్ర నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి హుజూర్ నగర్, సెప్టెంబర్ 17(జనం సాక్షి): తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ పోంచర్ల(హుజూర్ నగర్) నియోజకవర్గంలో రాష్ట్ర నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు అందరూ ఈ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆనాడు నిజాం పరిపాలనలో ఖాసిం రిజ్వి అనే క్రూరుడు తన సైన్యంతో కలిసి తెలంగాణ ప్రజల పైన చేసిన దాడులు హత్యలు ఆడపడుచుల మానప్రాణాలతో ఎలాంటి నీచమైన చర్యలు చేశారో ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ అరాచకాలు అన్నింటి నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగజేయడానికి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తన సైన్యంతో వచ్చి నిజాం కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలను విముక్తులను చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అలాంటి చరిత్ర కలిగిన తెలంగాణను ఖాసిం రాజ్వికి మద్దతుగా నిలిచిన ఎంఐఎం పార్టీ వారసత్వంగా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుందని తెలియజేశారు. అలాంటి మతతత్వ పార్టీకి కెసిఆర్ గులాం గిరి చేస్తున్నారు, అప్పటి రజాకార్లు, దొరలు కలిసి తెలంగాణ ప్రజలను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో, అలాగే అప్పటి నయా నిజాం ఇప్పటి నయా నిజాం కేసిఆర్ ఎంఐఎం పార్టీ కలిసి హిందూ ధర్మాన్ని కాపాడుతున్న బిజెపి పార్టీని మతతత్వ పార్టీ అని చెడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిని ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకి మూడు ఎకరాలు, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దళిత బంధు ఇచ్చారా అని ప్రశ్నించారు, కేవలం హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి తూతూ మంత్రంగా దళిత బందును కొంతమందికి ఇచ్చి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని అన్నారు.8 సంవత్సరాల నుండి నిర్వహించని తెలంగాణ విమోచన దినోత్సవన్ని కేంద్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించాలని ప్రకటించిన తర్వాత ఈ కేసీఆర్ జాతీయ సమైక్యత పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తప్పకుండా నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, బూత్ అధ్యక్షులు, బూత్ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.