చందానగర్ డివిజన్ ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దుతా – డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి”

శేరిలింగంప‌ల్లి, జూన్ 06( జనంసాక్షి): చందానగర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పన తోపాటు, సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే మోడల్ డిజన్ గా తీర్చిదిద్దుతానని డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు పద్మజా నగర్, రాజేంద్రనగర్, సిటిజెన్ కాలనీ, శివాజీ నగర్ వీకర్ సెక్షన్ కాలనీకి సంబంధించి జలమండలి, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి సోమవారం ఆయా బస్తీలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వర్షాకాలం రాబోతున్నందున ఎక్కడ అపరిశుభ్రతకు తావివ్వకూడదని, తద్వారా అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలడానికి కారణం కాకూడదని అధికారులకు సూచించారు. ఆయా కాలనీల్లో జిహెచ్ఎంసి సిబ్బంది సహకారంతో రోడ్ల పైన ఉన్న చెత్తను తొలగించి వీధులను శుభ్రం చేశారు, పరిసర ప్రాంతాలలోని కాలనీలలో నెలకొనివున్న ఖాళీ ప్రదేశాలలో చెత్తాచెదారాన్ని తొలగించి కాలనీలకు కొత్త శోభను తీసుకొచ్చారు. ప్రతి కాలనీలో సభ్యులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలనీలలో నెలకొన్న స్వచ్ఛతను బట్టే వారి ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయని అన్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే సహకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ సహకారంతో యావత్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగంగా సాగుతున్నాయని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపరిశుభ్రత కు తావులేకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని మంజుల రఘునాథ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీ కాంతి, జలమండలి విభాగం జనరల్ మేనేజర్ సునీత, ఎలక్ట్రికల్ ఏఈ రమేష్, శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.