చంద్రబాబుకు లొంగిపోయిన కాంగ్రెస్
మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
కామారెడ్డి,నవంబర్3(జనంసాక్షి): మహాకూటమి పేరుతో తెలంగాణ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబుకు తొత్తుగా మారారని దుయ్యబట్టారు. ఇదేతీరు కొనసాగితే మళ్లీ తెలంగాణకు ఆంధ్రాలో కలిపేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మహాకూటమి పేరుతో వస్తున్న వారికి తగిన బుద్ధిచెప్పాలని కోరారు. ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రతీ కార్యకర్త అంకితభావంతో పనిచేసి టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల తీరుతెన్నులు, ఫలితాలను గడప గడపకూ ప్రచారం చేయాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యనాయకులు, బూత్‌స్థాయి కన్వీనర్లు, కార్యకర్తలకు దిశానిర్దేశర చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, వివిధ కార్పొరేషన్ల రుణాలు, మత్సకారులు, గొర్రెల పెంపకందార్లను సబ్సిడీ రుణాలు, కేసీఆర్ కిట్, స్త్రీనిధి రుణాలు, తదితర పథకాల గురించి ఇంటింటా అవగాహన కల్పిస్తూ ప్రజలు లబ్దిపొందిన తీరును వివరించాలని ఆదేశించారు. ప్రతి బూత్‌స్థాయి కన్వీనర్‌కు 60మంది ఓటర్లను బాధ్యతగా ఇస్తున్నామని, దీనిని అంకితభావంతో వివరించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా రెండు కళ్లలా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. రూ. 42వేల కోట్ల బ్జడెట్‌తో 36 ప్రజోపకర పథకాలను ప్రవేశపెట్టి నూరు శాతం అమలుచేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. దీని సగర్వంగా చెప్పుకోవాలన్నారు. వచ్చే జూన్ మృగశిరకార్తె నాటికి కాళేశ్వరం నీరు నిజాంసాగర్‌కు వచ్చి చేరుతుందని, దీంతో సాగు, తాగునీటి కష్టాలు ఇక ఉండవన్నారు. బాన్సువాడ నియోకవర్గంలో సాగర్ ఆయకట్టు లేని ప్రాంతాల్లోనూ కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం అవుతుందన్నారు. ధికారం కోసం పనికిమాలిన పార్టీలతో జతకట్టిన కాంగ్రెస్‌ది పనికిమాలిన మహా కూటమి అని… కాంగ్రెస్‌కు ఇసుమంతయినా సిగ్గులేదని మంత్రి విమర్శించారు. లేనిపోని హావిూలతో ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం సన్నగిల్లిందని, దొంగమాటలతో పూర్తి విశ్వాసం కోల్పోతున్నారన్నారు. తాము ఒకే
వ్యక్తి నాయకత్వంలో సుపరిపాలను అందిస్తామని, కలహాల కాంగ్రెస్‌లో ఐదేళ్లలో 15మంది సీఎంలు మారుతారని ఎద్దేవా చేశారు.