చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి

– హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నా సద్వినియోగం చేసుకోలేదు
– అవినీతికి పాల్పడనప్పుడు అంత ఉలుకెందుకు
– రాజకీయ లబ్ధికోసమే కేంద్రంపై యుద్ధం అంటున్నాడు
– బీజేపీపై ప్రజలను రెచ్చగొట్టేలా చేస్తున్నాడు
– జగన్‌, పవన్‌లతో బీజేపీ జతకడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
– అన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం
– బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
న్యూఢిల్లీ, మే14(జ‌నం సాక్షి) : చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి, ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా సద్వినియోగం చేసుకోలేక రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ మొదటిసారి సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈసందర్భంగా అక్కడి విలేకరులతో కన్నా మాట్లాడుతూ.. ¬దాకు బదులు ప్యాకేజీ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడనప్పుడు… చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2019 ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఇప్పుడే చెప్పలేమని, పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌తో బీజేపీ జతకడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. అందరినీ ఏకం చేసి పార్టీ విజయం కోసం పాటుపడతానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను బీజేపీపై రెచ్చగొట్టాలని తెదేపా ప్రయత్నిస్తుందని, దీని ద్వారా రాజకీయ లబ్ధిపొందేలా ప్రయత్త్న చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశరు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను, ఏపీకి చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెబుతామని అన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా నియామకంపై ఉభయగోదావరి జిల్లాలా బీజేపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజమండ్రి అర్బన్‌ బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు… ఆ పార్టీకి రాజీనామా చేశారు. దత్తు బాటలోనే బీజేపీ రాజమండ్రి అర్బన్‌ కార్యవర్గం ఉన్నట్లు సమాచారం. కన్నా నియామకంపై త్వరలో హైకమాండ్‌ పెద్దలతో మాట్లాడుతామని నేతలు అంటున్నారు. వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన కన్నాకు .. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారని నేతల మండిపడుతున్నారు.