చంద్రబాబు కుట్ర విఫలమైంది

– ఆయన చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు
– ఏపీ ప్రజలు అందుకు సిద్ధంగా ఉన్నారు
– తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటుతుంది
– బీజేపీ నాయకుడు రాంమాధవ్‌
న్యూఢిల్లీ, మే15(జ‌నం సాక్షి ) : కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు విఫలమయ్యాయని బీజేపీ నాయకుడు రాంమాధవ్‌ అన్నారు. కర్ణాటక ఎన్నిల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడారు. కన్నడనాట బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు.  కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినా ఆయన మాటలను కన్నడ తెలుగు ప్రజలు పట్టించుకోలేదన్నారు. దీనికి నిదర్శనం  హైదరాబాద్‌ కర్ణాటకలో బీజేపీ గెలిచిందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ కర్ణాటకలో 40 స్థానాలకు గానూ.. 20 స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉందన్నారు. 2013లో ఈ ప్రాంతంలో 6 స్థానాలకే బీజేపీ పరిమితమైందని, చంద్రబాబు కుట్రను తెలుసుకున్న అక్కడి తెలుగు ప్రజలు బీజేపీకి పట్టం గట్టారన్నారు. కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో దక్షిణాదిలో తమ విజయానికి బాటలు పడ్డాయని రాంమాధవ్‌ పేర్కొన్నారు. ఇక ఈ హవా దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు దక్షిణాదిన కేంద్రానికి ప్రేమలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేశంలోని అన్ని ప్రాంతాలు బీజేపీకి సమానమన్నారు. ఈ ఫలితాలతో కేవలం కొందరు నేతలు మాత్రమే బీజేపీపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు మాత్రం మోడీ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారని అర్థమైందన్నారు. రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధిష్టానం దృష్టిసారిస్తుందని, ఏపీకి బీజేపీ చేసిన సాయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసి చంద్రబాబు నాటకాలను బయటపెడతామని రామ్‌మాధవ్‌ స్పష్టం చేశారు.