చక్కెర కర్మాగారం తెరిపించండి

మాజీ మంత్రి తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం, జూలై 26 : మూతపడిన ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార రంగంలోనున్న చక్కెర పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం వీటినిప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే ఆమదాలవలస చక్కెర పరిశ్రమ కేవలం యాజమాన్య మార్పిడి కోసం మూతపడిందన్నారు. వాస్తవానికి విరుద్ధంగా పరిశ్రమ మూతపడడానికి తమ్మినేని సోదరులే కారణమంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేసి గత ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. కోర్టులో నిలుపుదల ఉత్తర్వుల ద్వారా చక్కెర పరిశ్రమను పునరుద్ధరించనివ్వ కుండా ప్రవేటు యాజమాన్యానికి అడ్డంకి కల్పించారని ఆయన ఆరోపించారు. చక్కెర పరిశ్రమను పునరుద్ధరించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని కోరగా, ఆయన తెరిపిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా పరిశ్రమకు అతీగతీ లేదన్నారు. వ్యక్తులు ఎవరు హామీ ఇచ్చినా, పార్టీ తరపున దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఉందన్నారు. పరిశ్రమ తెరిపించేందుకు తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సీతారాం అన్నారు. చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు ఈ నెల 31న అన్ని రాజకీయ పార్టీలతో రౌండు టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ప్రధాన విజయరాం, సింతు సుధాకర్‌, రోణంకి మల్లేశ్వరరావు, తమ్మినేని నాని తదితరులు పాల్గొన్నారు.