చట్టానికి విధేయులై ఉండాలి

విద్యార్థినీ విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరూ చట్టానికి విధేయులై ఉండాలని హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర విద్యార్థులను కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  కార్యక్రమంలో భాగంగా మండలంలోని గడ్డిపల్లి ఆదర్శ గురుకుల కళాశాలలో శుక్రవారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనీ చట్టం ఎవరికి చుట్టము కాదనీ చట్టం ముందు అందరూ సమానులేననీ ఆయన తెలిపారు. గంజాయి గుట్కా లాంటి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా ప్రక్రియలో చిన్నారి బాల బాలికలను విద్యార్థినీ విద్యార్థులను సంఘవిద్రోహక శక్తులు కొరియర్లుగా వాడుకుంటున్నారని తెలియడంతో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని  అప్రమత్తం చేయడానికి న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అపరిచిత వ్యక్తుల ప్రలోభాలకు లోనై నేర సామ్రాజ్యంలో పాత్రులు కావద్దని ఆయన హితవు పలికారు. ఎఫ్. ఐ .ఆర్ నమోదు కాబడిన దగ్గర నుండి కోర్టులో అంతిమ తీర్పు వెలువడే వరకు జరిగే కేసుల విచారణ ప్రక్రియను ఆయన విద్యార్థులకు వివరించారు. కళాశాల యాజమాన్యాలు కోరితే విద్యార్థులు కోర్టులో జరిగే వాద ప్రతిపాదనలను ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, అదనపు పి.పి. శ్రీనివాస్, ఏ. జి. పి. ఉప్పల గోపాల కృష్ణమూర్తి, న్యాయవాదులు ఎం.ఎస్.రాఘవరావు, మీసాల అంజయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, కుక్కడపు సైదులు, జక్కుల నవీన్, ప్రిన్సిపాల్ దండం రవికుమార్, ఎస్సై కొండల్ రెడ్డి, సర్పంచ్ నాగేశ్వరరావు, ఎం.పి.టి.సి. మేకల స్రవంతి, కళాశాల, న్యాయశాఖ సిబ్బంది పాటలి చంద్ర, రాము,  శ్యాం కుమార్, సుశీల, చంద్రశేఖర్, షేక్ ఖాసిం, అమల, కృష్ణవేణి,విఘ్నేశ్వరి, సాయమ్మ, కాంతమ్మ, మీసాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.