చరిత్ర హీనుడు ప్రకాశ్ రెడ్డి
బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
జగదేవ్ పూర్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి):
భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణా పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన బిజెపి నాయకుడు ప్రకాశ్ రెడ్డి చరిత్రహీనుడని జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ మండిపడ్డారు. టీవీ9 చానెల్ డిబేట్ లో బిజెపి నాయకుడు ప్రకాష్ రెడ్డి ఐలమ్మ పోరాటాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి నాయకుడు ప్రకాశ్ రెడ్డికి మతి భ్రమించిందని అగ్రవర్ణ దురహంకారంతో తెలంగాణ పోరాట వీరవనిత ఐలమ్మ ఉద్యమ చరిత్రను పక్కదారి పట్టించే ప్రయత్నం సాగిస్తున్నాడని ఆరోపించారు. ఆనాడు కుటుంబ సమస్యలతో మొదలైన ఐలమ్మ పోరాటం కమ్యూనిస్టు పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయం విస్మరించడం ప్రకాశ్ రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు. నిజాం నవాబుకు తొత్తులుగా ఉన్న దొరలు, దేశ్‌ముఖ్ లని గుండెధైర్యంతో ఎదిరించి రజాకార్లను తరిమికొట్టిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ క్రమంలో చరిత్రలో మేధావులు, రచయితలు సైతం చాకలి ఐలమ్మ ఉద్యమ నేపథ్యాన్ని ఉటంకించడాన్ని ఐలమ్మ ఉద్యమ చరిత్రను వక్రీకరించడమే నని ఆయన ఆరోపించారు.ఈ విషయంలో బిజెపి నాయకుడు ప్రకాశ్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మండల రజక సంఘం గౌరవాధ్యక్షుడు అక్కారం నర్సింలు, ఉపాధ్యక్షులు జూపల్లి రాజశేఖర్, రాచకొండ యాదగిరి, వడ్లకొండ శ్రీనివాస్, రాచమల్ల శ్రీనివాస్, జూపల్లి భాస్కర్ రాచకొండ ఆంజనేయులు ఎడపల్లి వెంకటయ్య ప్రధాన కార్యదర్శి కొమ్మాట సాయిబాబా కోశాధికారి రాచకొండ బాల్ నర్సయ్య కార్యవర్గ సభ్యులు మర్రిగడ్డ తిరుపతి రాచమల్ల సీతయ్య హనుమాండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.