చర్చలే పరిష్కారం చూపుతాయి
భారత్-చైనా సరిహద్దులోని లడఖ్ ప్రాంతం ఇప్పుడు యుద్ధభూమిని తలపిస్తోంది. వాస్తవాధీన రేఖ దాటి చైనా బలగాలు 19 కిలోమీటర్లు భారత్ భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. ఈ సందర్భంగా చైనా వితండవాదానికి దిగుతుంది. అసలు వాస్తవాధీన రేఖ ఎక్కడవుందో తెలియదని చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా వ్యాఖ్యానించింది. సైనిక చొరబాటుపై దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాలకపక్షం ఒకలా, ప్రతిపక్షాలు మరోలా మాట్లాడుతుండటంతో అసలు లడఖ్‌లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. చైనా సైనిక బలగాలు భారత భూభాగంలో 19 కిలోమీటర్ల వరకూ చొచ్చుకువచ్చాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆయన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న లడఖ్ ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులను కేంద్రం ముందుంచారు. దీంతో దేశంపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయా? అనే అనుమానాలు సామాన్యుల్లో ముసురుకున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం కవ్వింపు చర్యలతో ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా దేశంలోని రాజకీయ పక్షాలు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించాయి. చైనాలోనూ అవే పరిస్థితులు కనిపించాయి. చైనా ఇప్పుడు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. భారత్‌తో పోలిస్తే అన్ని రంగాల్లోనూ బలిష్టమైనది కూడా. కానీ చైనా గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఒక్కటే. చైనాను ఆర్థికంగా ప్రబల శక్తిగా నిలిపింది భారత మార్కెట్. చైనాలో తయారయ్యే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు భారత మార్కెట్‌లో దర్శనమిస్తుంది. అవే ఫీచర్స్ కలిగిఉన్న బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్‌తో పోలిస్తే అవి కారు చౌక. దీంతో సామాన్య భారతీయులు మోజుపడి వాటిని కొనుగోలు చేస్తారు. ఒక్క భారత్ తప్ప చైనా వస్తువులకు వేరే మార్కెట్ లేదు. ప్రస్తుత తరుణంలో భారత్ కనుక చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిస్తే అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఛిన్నాభిన్నం కావడం ఖాయం. ఈ విషయం చైనా ప్రభుత్వానికీ తెలుసూ. అయినా మొండిగా ఎల్‌వోసీ దాటి తన సేనలను ముందుకు నడిపింది. భారత నిఘా వ్యవస్థలోని లోపాలను లడఖ్ చొరబాట్లు మరోసారి తేటతెల్లం చేస్తున్నాయి. భారత సరిహద్దు దాటి చైనా బలగాలు 19 కిలోమీటర్ల దూరం చొచ్చుకువచ్చేదాక మన నిఘా వ్యవస్థ మొద్దు నిద్ర వీడలేదు. వాస్తవాధీన రేఖ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలూ కానరావు. చైనా సైనికులు రోజుల తరబడి ముందుకు వచ్చి భారత భూభాగంలో డేరాలు వేసుకొని తమ దేశపు జాతీయ జెండాను ఎగురవేసే వరకూ చొరబాట్లను మన నిఘా వ్యవస్థ గుర్తించలేకపోయింది. చైనా సైనిక బలగాలను అంతకంటే ముందుకు చొచ్చుకు వస్తే భారత సైన్యం వారిని తిప్పికొట్టిందనే వార్తలూ వెలువడ్డాయి. ఇప్పటికీ చైనా బలగాలు భారత భూభాగంలోనే తిష్టవేసి ఉన్నాయి. వాటి వల్ల ఇప్పటికిప్పుడు దేశంపై యుద్ధ రాదని కూడా తేటతెల్లమైంది. ముందు సైనిక చొరబాటును ఉసిగొల్పిన చైనా ఏదో కారణాలతో అంతకంటే ముందుకు సాగడం లేదు. అందుకు కారణమూ లేకపోలేదు. భారత్ కయ్యానికి దిగితే తమ దేశపు ఆర్థిక మూలాలు దెబ్బతింటాయన్న విషయం చైనాకు తెలుసు. యుద్ధం వల్ల ఆ దేశానికి ఒనగూరే ప్రయోజనాలు లేకపోగా ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. అదేసమయంలో భారత పాలకులతో పాటు ప్రతిపక్షాలు ఈ విషయంలో బాధ్యతా రాహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నివారణకు చైనాలో పర్యటించి సంప్రదింపులు జరుపుతానన్న భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటనను అన్ని పక్షాలు తప్పుపట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో పర్యటించనే వద్దంటూ పట్టుపట్టాయి. ఎంత పెద్ద సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చనే విషయాన్ని మరిచి కయ్యానికే కాలుదువ్వమన్నట్టుగా సంకేతాలు పంపుతున్నాయి. భారత సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తితే యుద్ధం చేయడం తప్పుకాదు. కానీ చర్చల ద్వారా పరిస్థితి అంతదూరం రాకుండా కూడా నివారించవచ్చు. అదే విషయాన్ని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రెండు రోజుల క్రితం ప్రత్యేక కథనం ద్వారా ప్రస్తావించింది. తమ దేశం సంప్రదింపుల ద్వారా సమస్యకు పరిష్కారం చూపేదిశగా అడుగులు వేస్తోందని ఆ పత్రిక పేర్కొంది. చైనా ప్రభుత్వ వైఖరిని ఉటంకిస్తూనే గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఆర్థికంగా ఎంత బలీయమైన దేశమైన సహృద్భావపూరిత వాతావరణంలో చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ విషయాన్ని విస్మరిస్తే ఎంతవారికైనా చేటు తప్పదు. ఆర్థికంగా బలీయమైన తన మూలాలను చూసుకొనే అమెరికా పలు దేశాలపై దురాక్రమణకు దిగింది. చమురు నిల్వలు, సహజ వాయువు అత్యధికంగా ఉన్న దేశాలను తమ కిందికి తీసుకువచ్చేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నింది. ప్రపంచాన్ని ముంచెత్తిన ఆర్థిక మాంద్యంతో అగ్రదేశం ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. ఇప్పుడిప్పుడు కోలుకుంటోంది. చైనా అదే కుతంత్రాన్ని భారత్ ప్రయోగించాలనుకుంటే చతికిలబడటం ఖాయం. ఆ విషయం త్వరగానే గ్రహించిన చైనా చర్చలు చేస్తామంటూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్తోంది. యుద్ధాలు, బలప్రదర్శనకు చేసే ప్రయత్నాలు తెచ్చిపెట్టే విపత్కర పరిణామాలు త్వరగానే అంచనా వేసిన చైనా ఓ మంచి నిర్ణయమే తీసుకుంది. చర్చలు సుహృద్భావపూరిత వాతావరణంలో జరగాలి. ఎల్‌వోసీని పటిష్టపరుచుకోవాలి. మళ్లీ కవ్వింపులకు దిగకుండా చైనా తన సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించుకోవాలి. ఈ ఘటనల నుంచి భారత్ కూడా ఎన్నో పాఠాలు నేర్వాల్సి ఉంది. దేశ భద్రతా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవాలి. నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరుచుకోవాలి. శత్రువు మన శక్తిని, యుక్తినీ తక్కువ అంచనా వేసేందుకు దారితీసిన పరిణామాలను సమీక్షించుకోవాలి. ఇప్పుడు రాజకీయ పక్షాలు చేయాల్సింది ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు. నిర్మాణాత్మక సలహాలు.. సూచనలు. మరోసారి, మరోదేశం మన భూభాగం వైపు చూడకుండా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతస్థాయి సంప్రదింపులు. దేశ భద్రతను కూడా ఎన్నికల్లో లబ్ధికీ వాడుకోవాలని చూస్తే అంతకుమించి క్షమించరాని విషయం మరొకటి ఉండదు.