చర్లపల్లి జైలులో దారుణం
మతిస్థితమితం లేని ఓ ఖైదీ తోటి ఖైదీలపై దాడి
ఏడుగురికి గాయాలు
హైదరాబాద్, జూలై 4 (జనంసాక్షి): రాజధానిలోని చర్లపల్లి జైల్‌లో దారుణం జరిగింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న దాసరి నర్సింహ అనే ఖైది తోటి ఖైెదీలపై కత్తెరతో దాడిచేశాడు. ఈ ఘటనలో వెంకటయ్య (60) అనే ఖైది మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో మెదక్ జిల్లాకు చెందిన ఊషయ్య, కుకట్‌పల్లికి చెందిన చలపతి అనే ఖైదీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలి సింది. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో నర్సింహ కత్తెరతో దాడి చేశాడని జైౖల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. కొంత కాలంగా నర్సింహకు మతిస్థిమితం లేకపోవడంతో అతనికి చికిత్సను అందించామని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. అకస్మాతుగా ఈ తెల్లవారుజామున తోటి ఖైదిలపై దాడికి దిగాడని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులని భావిస్తున్న లక్ష్మయ్యనాయుడు, కృష్ణయ్య అనే వార్డర్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై జైళ్ల శాఖ డిజి విచారణకు ఆదేశించారని తెలిపారు. రాయలసీమ రేంజ్ జైళ్ల శాఖ డిఐజి జయవర్ధన ్‌ను విచారణాధికారిగా నియమించినట్లు చెప్పారు. ఈఘటనపై జైలు అధికారులు కుషాయిగూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కాగా చర్లపల్లి జైల్ ఘటనపై హోం మంత్రి సిబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. గాయపడిన ఖైెదీలకు తక్షణమే చికిత్సను అందించాలని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాలని ఆమె జైళ్ల శాఖ డిజిని ఆదేశించారు. ఈ ఘటనలో అధికారులు బాధ్యులని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. జైల్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె డిజిని ఆదేశించారు. ఇదిలా ఉండగా జైలులో జరిగిన దాడి సంఘటనలో మరణాలు సంభవించిన విషయాన్ని జైల్ అధికారులు ఇంకా దృవీకరించడం లేదు. ఈ దాడి ఘటనలో వెంకటయ్యతోపాటు ప్రదీప్ అనే మరో ఖైది కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.