చలితీవ్రతకు జ్వరాల విజృంభణ

ఆస్పత్రులకు క్యూకట్టిన ప్రజలు
అప్రమ్తంతగా ఉండాలన్న వైద్యులు
హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): చలి పెరుగడంతో ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫీవర్‌ ఆస్పత్రితో పాటు వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. మారిన వాతావరణం కారణంగా  చలిజ్వరం, దగ్గు, జలుబులాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు. చిన్నపిల్లలతోపాటు పెద్దలు
ప్రత్యేకించి వృద్ధులు, శ్వాసకోశ వాధిగ్రస్తులు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఉత్తరాది నుంచి శీతల పవనాలు, వాటికితోడు కోస్తాంధ్రపై తీవ్రంగా, తెలంగాణపై చురుకుగా ఉన్న ఈశాన్య రుతుపవనాలు.. అన్నీ కలిసి రాష్ట్రంపై ముప్పేటదాడి చేస్తున్నాయి. మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో సాధారణ ఉష్ణోగ్రతలు 5 నుంచి పది డిగ్రీల సెల్సియస్‌ మేరకు పడిపోయాయి. దీంతో పగటిపూట కూడా చలి వణికిస్తోంది. రాత్రుళ్లు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వీస్తున్న చలిగాలులతో రాష్ట్ర ప్రజలు గజగజ వణికి పోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అనివార్యంగా బయటకు రావాల్సినవారు, స్కూలు విద్యార్థులు స్వెట్టర్లు, జర్కిన్లు వేసుకుని మరీ వస్తున్నారు. ఖమ్మంలో సాధారణంకంటే 6.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత పడిపోగా.. నిజామాబాద్‌లో 10.2 డిగ్రీలు తగ్గింది. ఇతర జల్లాల్లోనూ దాదాపు ఇదేస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా చలి గాలులకు రాత్రిపూట తిరుగడానికి వెనుకాడే ప్రజలు ఇప్పుడు రెండ్రోజులుగా పగలు కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పగటిపూట చలి తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  రాత్రిపూట మాత్రం ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి తీవ్రంగానే ఉంటుందని తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కూడా ఉన్నదని చెప్పారు. పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావం తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌ తదితర ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ఉంది. అటు రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్కే జోషిని  ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి తీరంలోని ఆటవీ ప్రాంతమైన అదిలాబాద్‌, భద్రాచలం, జయశంకర్‌- భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్‌, కుమ్రంభీం- ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అవసరమైన మందులు, దుస్తులు అందించాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.
జూలో జంతువులకు ప్రత్యేక రక్షణ
పెథాయి తుఫానుతో నగరంలో చల్లని వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జూ పార్క్‌ జంతువుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని జూ పార్క్‌ క్యూరేటర్‌ క్షితిజ తెలిపారు. రానున్న రోజుల్లో చలి కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో పాటు నగరంలో నెలకొన్న చల్లని పరిస్థితుల నుంచి జంతువులను రక్షించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మృగరాజుల వద్ద వేడిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పక్షుల వద్ద జూట్‌ సంచులను
ఏర్పాటు చేసి చల్లదనం నుంచి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. జంతువుల వద్ద వాటి గదుల్లో ఉష్ణోగ్రతలను సమతూకంగా ఉంచేందుకు హీటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  చలికాలం ముగిసే వరకూ ఈ పక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.