చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బి లోకూర్
నెల్లూరు, మే 27 (జనంసాక్షి):
రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బి లోకూర్ అన్నారు. నెల్లూరులోని వేదాయపాలెంలో ఉన్న క్యాప్ సంస్థను ఆయన ఆదివారం ఉదయం సందర్శించారు. చైల్డ్ అండ్ పోలీస్ పేరిట ఈ సంస్థను గత ఏడాది నవంబర్‌లో జిల్లా ఎస్పీ రమణకుమార్ ప్రారంభించారు. నెల్లూరు నగరం లోని శ్మశానంలో కాపురం ఉంటున్న 200 కుటుంబాల నుంచి పిల్లలను తీసుకువచ్చి వారికి ఉచిత భోజనం, వసతి, విద్య కల్పిస్తున్న వైనాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న మదన్ బీ లోకూరు ఆదివారం నాడు ఆ కార్యక్రమాల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా పోలీస్ శాఖ ఈ విధంగాసేవలు చేయడం శుభపరిణా మన్నారు. ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి కార్యక్రమాన్ని చేపడతాయని, పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దేశ చరిత్రలోనే మొదటి సారి ఆయన కొనియాడారు. ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ క్యాప్‌ను సమర్థంగా నిర్వహించేందకు ఇప్పటికే 69 మంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. వీరు నెలకు ఒకసారి సమావేశమై క్యాప్‌ను అమలు చేయాల్సిన విధానాలపై సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. దీనికి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం ఎంతో ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.