చివరికీ ట్రోఫీ చిక్కెదెవరికో…?

 

చివరి అంకానికి చెరుకున్న ఛాంపియన్స్‌ ట్రోఫి

నేడే భారత్‌-ఇంగ్లాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌

అభిమానుల్లో ఉత్కంఠ

బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న ఇండియా

గెలుపు పై ఇంగ్లాండ్‌ ధీమా

బర్మింగ్‌హామ్‌ ,జూన్‌ 22 (జనంసాక్షి):

రెండు వారాలుగా ఎనిమిది అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ సమరం తుది అంకానికి చేరుకుంది. చరిత్రలో కలిసిపోనున్న ఈ టోర్నీ చివరి టైటిల్‌ను గెలుచుకునేందుకు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు సిధ్దమయ్యాయి. గత ప్రదర్శనలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకు పోతోన్న టీమిండియా చారిత్రక విజయానికి అడుగు దూరంలో నిలిచింది. అటు క్రికెట్‌కు పుట్టినిల్లుగా పిలిచే తమ సొంతగడ్డపై తొలి ఐసిసి టైటిల్‌ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్‌ భావిస్తోంది. రెండు జట్లూ ఫామ్‌ పరంగా సమానంగా ఉండడంతో ఎవ్వరినీ తక్కవ అంచనా వేయలేకపోతున్నారు.ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ వివాదం తర్వాత భారత జట్టు ఆడిన తొలి టోర్నీ ఇదే. దీంతో జట్టు ఏ మేరకు రాణిస్తుందో… సీనియర్లు లేని వేళలో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అన్న అభిమానుల ఆందోళనలకు ధోనీసేన ఆదిలోనే తెరదించేసింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల నుండే రెచ్చిపోయింది. వరుసగా డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలతో తిరుగులేని ఆధిపత్యం కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. బ్యాటింగ్‌లో అందరూ సమిష్టిగా రాణిస్తుండడంతో ఎలాంటి ఆందోళనా లేదు. ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌శర్మ మంచి పునాది వేస్తున్నారు. ప్రారంభంలో కాస్త తడబడిన రోహిత్‌ ఇప్పుడు మాత్రం కుదురుకున్నాడు. అలాగే సూపర్‌ఫామ్‌తో అదరగొడుతోన్న ధావన్‌ ఇప్పటికే రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్‌ కోహ్లీ, సురేష్‌ రైనాలతో పాటు దినేష్‌ కార్తీక్‌ కూడా విదేశీ పిచ్‌లపై పరుగులు సాధిస్తున్నారు. చివర్లో ధోనీ, రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్‌ కూడా భారత సత్తాకు నిదర్శనంగా చెప్పొచ్చు. అటు బౌలింగ్‌లో పేస్‌ త్రయం అదరగొడుతోంది. భువనేశ్వర్‌ కుమార్‌ ప్రారంభ ఓవర్లలోనే వికెట్లు తీస్తుంటే… ఉమేశ్‌ యాదవ్‌, ఇశాంత్‌ శర్మ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. స్పిన్‌ విభాగంలో అశ్విన్‌ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. అతనికి తోడుగా పార్ట్‌టైమ్‌ బౌలర్‌ జడేజా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. తక్కువ పరుగులు ఇవ్వడంతో పాటు కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టు విజయాలలో కీలకంగా మారిపోయాడు. గత రికార్డులు కూడా భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి. గత రెండేళ్ళలో ఇంగ్లాండ్‌తో తలపడిన 10 వన్డేలలో టీమిండియా 8 మ్యాచ్‌లు గెలుచుకుంది. మరోవైపు సొంతగడ్డపై అభిమానుల అంచనాలను నిలబెట్టిన ఇంగ్లాండ్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌, ఇయాన్‌ బెల్‌, జొనాథన్‌ ట్రాట్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్ళతో ఇంగ్లీష్‌ టీమ్‌ బలంగా ఉంది. ముఖ్యంగా నిలకడగా రాణిస్తోన్న ట్రాట్‌ మరోసారి వారికి కీలకం కానున్నాడు. మిడిలార్డర్‌లో మోర్గాన్‌ ఫామ్‌లోకి రావాల్సి ఉండగా… రూట్‌, బట్లర్‌, బొపారా చివరి ఓవర్లలో మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్‌లో కూడా ఇంగ్లీష్‌ టీమ్‌ అద్భుతంగా రాణిస్తోంది. సొంతగడ్డపై ఆ జట్టు బౌలర్లు ఆండర్సన్‌, బ్రాడ్‌, ఫిన్‌ అదరగొడుతున్నారు. ప్రారంభ ఓవర్లలోనే బంతిని స్వింగ్‌ చేస్తోన్న ఆండర్సన్‌పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. భారత బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీయడం ద్వారా చివరి ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకోవాలని కుక్‌ సేన వ్యూహాలు రచిస్తోంది. టోర్నీకి అంతరాయం కలిగిస్తోన్న వరుణుడు ఫైనల్‌కు అడ్డుపడే అవకాశాలు కనిపించడం లేదు. వాతావరణం చల్లగా ఉన్నప్పటకీ.. వర్షం పడబోదని తెలుస్తోంది. అయితే పిచ్‌ స్వింగ్‌ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ వైపే మొగ్గుచూపొచ్చు.