చివరి కోరిక ఏమీ లేదని చెప్పిన కసబ్
ముంబయి: 26/11 దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడి విచారణ సమయంలో రకరకాల కోరికల చిట్టాను అధికారుల ముందు ఉంచిన అజ్మల్ కసబ్ చివరి ఘడియల్లో ఎలాంటి కోరికను వెల్లడించకపోవడం గమనార్హం. విచారణ ఎదుర్కొంటున్న సమయంలో తనకు బిర్యానీ తినాలని ఉందని, సినిమాల్లో నటించడానికే ఇక్కడికి వచ్చానని చెప్పిన కసబ్ తన చివరి కోరిక ఏమీ లేదని జైలు అధికారులకు తెలిపాడు. కసబ్‌ను ఉరితీసే ముందు పుణె ఎరవాడ జైల్లో మాన్యువల్ ప్రకారం విధివిధానాలను పూర్తి చేసినట్లు జైలు అధికారులు చెప్పారు. చివరి కోరిక ఏదైనా ఉందా? అని అడగగా.. ఏమీ లేదని కసబ్ సమాధానం చెప్పినట్లు తెలియజేశారు. కసబ్‌కు శిక్ష అమలు సమాచారాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేయాలని ముంబయి హైకోర్టు ఆదేశించినట్లు జైలు అధికారులు చెప్పారు.