చివరి మజిలీలోవిభజనాంశం
హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశం చివరి మజిలీకి చేరిందని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి, పక్కా సమైక్యవాది టీజీ వెంకటేశ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని పార్టీలు తమ వైఖరి చెప్పాయన్నారు. ఉప ఎన్నికల తంతు ముగిసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టి రాష్ట్ర విభజనపై పడిందన్నారు. ఇప్పుడు విభజనపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే తాజా పరిస్థితులను బేరీజు వేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయం ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అదే జరిగితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమని, దీన్ని ఏ శక్తీ అడ్డుకోజాలదని వెంకటేశ్ స్పష్టం చేశారు. విభజనపై పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తమ ప్రాంత ప్రజలకు చెప్పుకోవడానికి ముందుగా తమకు వివరించాలన్నారు.తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారేమోననే ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. 2009 మాదిరిగా అర్ధరాత్రి ప్రకటన చేయవద్దన్నారు. తమ రాయలసీమ ప్రాంతం ఇప్పటికే రెండు సార్లు మోసపోయిందని, మళ్లీ మూడోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఒక వేళ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాల్సి వస్తే రాయలసీమ నేతలకు ముందుగా చెప్పాలన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని సంకేతాలు ఇస్తున్నారన్నారు. మా హక్కుల గురించి ఆలోచిస్తే తెలంగాణకు మద్దతివ్వడంపై ఆలోచిస్తామన్నారు.
ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్ విభజన కోసం తమ వంతు ప్రయత్నాలూ చేస్తూనే ఉందని, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలతో తమకు ఎలాంటి శతృత్వం లేదని వెంకటేశ్ స్పష్టం చేశారు.తాము తమ ప్రాంత హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నామే తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన వివరణ ఇచ్చారు. ఉప ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించినవి కావన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నట్లు కనిపిస్తోందని వెంకటేశ్ పేర్కొన్నారు.