చురుకుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

రంగంలోకి దిగిన ఆశావహులు

వివరాలు తెలుసుకుని నమోదు చేయిస్తున్న నేతలు

నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఆయా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు పక్రియ ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ ఆశావహులు జోరుగా నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న మరికొన్ని ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు త్వరలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. /ూష్ట్రంలో ఖాళీగా ఉన్న శాసన మండలి స్థానాలను భర్తీ చేసే ఆలోచనతో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో నాలుగు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్నాయి. అందులో ఒకటి పట్టభద్రులు, మరొకటి ఉపాధ్యాయ నియోజక వర్గాలున్నాయి. మిగతా రెండింటిలో ఒకటి ఎమ్మెల్సీ కోటా కాగా.. మరోటి స్థానిక సంస్థల కోటాకు చెందింది.

నాలుగు శాసనమండలి స్థానాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది. పోటీకి ఆసక్తి చూపుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘం నాయకులు చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. మద్దతుపై మంతనాలు సాగిస్తున్నారు. సమావేశాలు, సామాజిక మాధ్యమాల్లో ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. తమ ప్రచారానికి సైతం సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే ఓటు నమోదును కూడా చేపట్టారు. ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో ఉన్న నియోజకవర్గాల నుంచి కిందటి సారి పాతూరి సుధాకర్‌రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందారు. పట్టభద్రుల స్థానం నుంచి ప్రస్తుత మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ విజయం సాధించారు. మార్చితో వీరి పదవీ కాలం ముగియనుంది. ఎమ్మెల్సీల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ పదవీ కాలం కూడా మార్చిలోనే ముగుస్తోంది. ఇక స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన తెరాసకు చెందిన భూపతిరెడ్డి, కాంగ్రెస్‌లో చేరిన క్రమంలో అనర్హత వేటు వేశారు. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. విశ్రాంత ఉద్యోగులు ఇద్దరు, విద్యావేత్తలు ముగ్గురు, ఓ విద్యార్థి సంఘం నాయకుడు తాము పోటీ చేస్తున్నట్లు సామాజికి మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్ల నమోదుపై వీరు దృష్టి సారించారు. విద్యావేత్తలు తమ విద్యాసంస్థల్లో పలు బ్యాచ్‌ల్లో చదివిన విద్యార్థుల జాబితాల ఆధారంగా మద్దతు కూడగడుతున్నారు. విశ్రాంత ఉద్యోగులు తమ పరిచయాలతో ముందుకు కదులుతున్నారు. ట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు పక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. కాకుంటే వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ విషయమై అంతగా ప్రచారం లేదు. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన వారు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గత జాబితాలో పేర్లు ఉన్న వారు సైతం తగు ధ్రువపత్రాలతో తప్పక నమోదు చేసుకోవాలి. 2015 నవంబరు నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు వేసేందుకు అర్హులు. తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉపాధ్యాయులు సైతం ఆయా కార్యాలయాల్లో ఫారం-19 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2012 నుంచి ఇప్పటి వరకు మూడేళ్లకు తగ్గకుండా ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధన అనుభవం గలవారు అర్హులు. గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లోనూ పనిచేస్తూ ఈ మేరకు అనుభవం గల వారు కూడా నమోదుకు అర్హులు.ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మరోసారి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన ప్రచారం సైతం ఆరంభించారు. ఇందుకు పీఆర్టీయూ నేతలతో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కొండల్‌రెడ్డి ఈసారి పోటీకి సిద్ధమయ్యారు. ఆయన ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పట్టభద్రుల స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన స్వామిగౌడ్‌ ఈసారి ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో తెరాస ఈసారి ఎవరికి మద్దతు ఇస్తుందనే చర్చ సాగుతోంది. కాగా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి కరీంనగర్‌, మెదక్‌ ప్రాంతాల వారే పోటీకి ఆసక్తి చూపగా.. ఈసారి

ఇందూరు నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు.