చెత్తతో నిండిన మేడారం.. పట్టించుకోని అధికారులు
తెలంగాణ మహా కుంభమేళా.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం జాతర ముగిసింది. కోటిన్నరకు పైగా తరలివచ్చిన భక్తులు.. సమ్మక్క – సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తుల రద్దీతో.. పారిశుద్ధ్యం లోపించింది. భక్తులు వదిలేసిన వ్యర్థాలతో ఇప్పుడు మేడారంలో దుర్గందం వెదజల్లుతోంది.
చెత్త తొలగించేందుకు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫెయిల్ అయ్యాయి. రాజమండ్రి, భద్రాచలం, చీరాల, వరంగల్ నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 2వేల మంది కార్మికులు చెత్తను తొలగించినా.. పెరిగిన భక్తులు రద్దీతో పారిశుద్ధ్య సమస్య తలెత్తింది. వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడంతో .. అమ్మవార్లకు బలిచ్చిన మూగజీవాల వ్యర్థాలతో జాతర ప్రాంగణం దుర్వాసన వెదజల్లుతోంది. గుడారాల పక్కనే మురికి నీళ్లు నిల్వ ఉండటంతో.. దోమలు పెరిగాయి. దీంతో పాటు సరిపడ టాయిలెట్స్ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ మల విసర్జనలు చేశారు. దీంతో పెరిగిన దోమలు, దుర్వాసనతో అనారోగ్యాల బారినపడతామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.