చెత్తరహిత పట్టణంగా అలంపూర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ అవార్డు

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 30)తెలంగాణ పట్టణ ప్రగతి ఫలితానిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ మున్సిపాలిటీ తోపాటు మరో రెండు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చెత్తరహిత పట్టణాలుగా అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ ఐఎస్ ఎల్ పోటీల్లో భాగంగా తెలంగాణలోని మూడు పట్టణాలు ఫిర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా సీడీఎంఏ ఎన్.సత్యనారాయణకు సమాచారం అందించారు. ఈ నెల 17న నిర్వహించిన ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీని నిర్వహించారు. ఈ పోటీల్లో దేశంలోని 1850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణలోని మూడు పట్టణాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఇప్పటికే దక్కిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులతో తెలంగాణ పట్టణాలకు 19 అవార్డులు దక్కాయి. 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో అలంపూర్ పట్టణ స్థానిక సంస్థ ఎంపికైంది. శుక్రవారం ఢిల్లీలో టల్కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ శాఖ సంయుక్త కార్యదర్శి రూప మిశ్రా చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ మనోరమ అవార్డును అందుకున్నారు . ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీల్లో భాగంగా, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు బృందాలను మున్సిపాలిటిలు ఏర్పాటు చేశాయి. కెప్టెన్లను నియమించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేయించారు. పాల్గొనేందుకు ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించారు. చేపట్టిన ప్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని అంచనా వేయడంలో భాగంగా రిజిస్ట్రేషన్లు, ఈవెంట్లు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా జరిగిన కార్యక్రమాలు ద్వారా అసెస్మెంట్ చేశారు. అలంపూర్ పట్టణానికి ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే అబ్రహంతో పాటు, మున్సిపల్ కమిషనర్ , సిబ్బంది, మున్సిపాలిటీ ప్రజల సహకారంతోనే ఈ అవార్డు వచ్చిందని అందరికీ మున్సిపల్ చైర్మన్ మనోరమ కృతజ్ఞతలు తెలిపారు.