చెల్లని చెక్కుల కేసులో ఆర్నెళ్లు జైలుశిక్ష

శ్రీకాకుళం, జూలై 21 : చెల్లని చెక్కులు ఇచ్చిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి జి.వి.నగేష్‌కు ఆరు నెలలు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జ్యుడీషియల్‌ ప్రథమ శ్రేణి న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఎం.వెంకటరెడ్డి నుంచి వ్యాపార అవసారల కోసమంటూ జీవీ నగేష్‌ అనే వ్యక్తి రూ.1,05,000 అప్పు తీసుకున్నాడు. ఆపై వాయిదాల పద్ధతిలో అప్పు తీర్చేందుకు ఒప్పుకుని, ఆ ప్రకారం చెక్కులు ఇచ్చాడు. మూడు చెక్కులు బ్యాంకులో దాఖలు చేయగా చెల్లింపులకు సరిపడిన నగదు లేదంటూ బ్యాంకు వర్గాలు ఆ మూడు చెక్కులను తిప్పి పంపేశారు. దీనిపై ఫిర్యాదుదారు వెంకటరరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వాయిదాలు విన్నా న్యాయమూర్తి నేరం రుజువైనందునే ముద్దాయికి ఆర్నెల్లు జైలు శిక్ష, రూ. 61,200ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.