చేతి చమురు వదులుతోంది

5

పెట్రో ధరలు తగ్గాయి… వినియోగదారులకు అందని ఫలాలు

గత 6 సంవత్సరాల్లో కనిష్ట స్థాయికి చమురుధరలు

ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ పెంచి ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వాలు

‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, జనవరి 18(జనంసాక్షి): దేశంలో సగటు పెట్రో వినియోగదారునికి చేతి చమురు వదులుతోంది. గత ఆరేళ్లలో కనిష్ట స్థాయికి పెట్రో ధరలు పడిపోయినా వినియోగదారులకు మాత్రం ఆ ఫలాలు అందడంలేదు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోధరలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రస్థుతం క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 45 డాలర్లకు పడిపోయింది. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ధర 115 డాలర్లు ఉండేది. అందుకే అప్పుడు పెట్రోధరలు విపరీతంగా మండిపోయాయి. లీటరు పెట్రోలు 84 రూపాయలకు, డీజిల్‌ 63 వరకు ఉండేది. ఇదే క్రూడ్‌ ఆయిల్‌ ధర 2009లో 50 డాలర్లు ఉండేది. అందుకే అప్పట్లో లీటరు పెట్రోల్‌ 47 రూపాయలు, డీజిల్‌ 37 రూపాయలకు లభించింది. ప్రస్థుతం కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర 50 డాలర్లకు పడిపోయింది. ఒపెక్‌ దేశాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగానే ముడిచమురు ధర పడిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇలా గణనీయంగా పడిపోయినా సగటు వినియోగదారునికి మాత్రం ఆ ఫలాలు అందటంలేదు.

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ఉత్పత్తి చేస్తున్న అరబ్‌దేశాలు, అమెరికా, రష్యాల వంటి ఒపెక్‌ దేశాలు గతంలో డిమాండ్‌ంటే తక్కువ ఉత్పత్తి చేయటం వల్ల ధరల్లో వ్యత్యాసం పెద్దగా ఉండకపోయేది. ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిన వెంటనే ఆయా దేశాలు చమురు ఉత్పత్తి చేయటం నిలిపివేసేవి. దీంతో హెచ్చుతగ్గులు లేకుండా ధరలు అదుపులో ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అగ్రరాజ్యం ఆధిపత్యానికి గండికొట్టాలనే ఉద్దేశ్యంతో అరబ్‌దేశాల్లో, రష్యా వంటి దేశాల్లో చమురు ఉత్పత్తి విపరీతంగా జరుగుతోంది. డిమాండ్‌ను మించి ఉత్పత్తి జరుగుతుండటంతో సహజంగానే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉత్పత్తిదారులు గతంలో ముడిచమురు బ్యారెల్‌ ధర కనీసం 80 డాలర్లు ఉండేలా చూసేవారు. కానీ ప్రస్థుతం ఆ పరిస్థితి లేకపోవడం, అగ్రరాజ్యం సైతం చమురుకంటే షెల్‌గ్యాస్‌ ఆధారిత వినియోగం పెంచటం వల్ల అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. నిజానికి వినియోగం తగ్గిన వెంటనే చమురు ఉత్పత్తి నిలిపేసే దేశాలు ప్రస్థుతం ఉత్పత్తిని నిలిపివేయలేదు. దీంతో చమురు ధరలు గడిచిన 5-6 సంవత్సరాల్లో కనిష్ట స్థాయికి పడిపోయాయి. అమెరికాలో స్వదేశీ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధర కేవలం ఒక డాలర్‌కు పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

అయితే ఇంతలా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా భారతదేశంలోని సగటు వినియోగదారునికి మాత్రం ఆ ఫలాలు అందటంలేదు. ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవటానికి పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ పెంచటం కారణంగానే వినియోగదారునికి లాభం ఒనగూరట్లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఓవైపు చమురుధరలు పడిపోతుంటే భారత ప్రభుత్వం మాత్రం దేశీయ చమురు సంస్థలపై  అమాంతం ఎక్సైజ్‌ సుంకం పెంచింది. దాదాపు 50శాతం వరకు ఎక్సైజ్‌ సుంకం పెంచటంతో దేశీయ మార్కెట్‌లో చమురు ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనిపించట్లేదు. గతంలోకంటే పెట్రోలుపై 2నుంచి 4 రూపాయల వరకు, డీజిల్‌ పై 2.50 రూపాయల వరకు కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారుని చేరేవరకు ధరలో వ్యత్యాసం కనిపించుకండా పోతోంది. దీనికితోడు కేంద్రం బాటలోనే తెలంగాణ రాష్ట్ర సర్కారు సైతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను పెంచింది. కేంద్రంతోపాటు రాష్ట్రం కూడా వ్యాట్‌ రూపంలో పన్ను వడ్డించటంతో పెట్రోలు,డీజిల్‌లపై లీటరుకు 2రూపాయల అదనపు ఆదాయం సమకూరుతోంది. పెట్రో ఉత్పత్తులపై ఏటా కేంద్రం 1 లక్షా 20 వేల కోట్ల మేర సబ్సిడీ రూపంలో వినియోగదారుల తరపున చమురు కంపెనీలకు చెల్లిస్తోంది. సబ్సిడీల వల్ల వస్తున్న ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు పన్నుల రూపంలో వసూలు ప్రారంభించింది. తత్ఫలితంగానే చమురుధరల ఫలాలు వినియోగదారులకు అందటంలేదని చెప్పొచ్చు. ఇటీవల పెంచిన ఎక్సైజ్‌ సుంకం ద్వారా ప్రభుత్వానికి 10వేల కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా. ఈ రకంగా ఇటి కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వడ్డించకుంటే 67 రూపాయలున్న పెట్రోలు ధరతోపాటు 55రూపాయలున్న డీజిల్‌ ధర ఇంకా తగ్గి ఉండేది. సబ్సిడీల వల్ల వస్తున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు పాలకులు అవకాశం చిక్కినప్పుడల్లా పన్నులు వడ్డించే పద్ధతికి స్వస్థి పలికితే ఫలాలు చివరి వినియోగదారుల వరకు చేరతాయి.