చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అగ్ని-5

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ) :చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5ను త్వరలోనే సైన్యానికి అప్పగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్య కలిగిన అస్త్రం. 5వేల కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి, శత్రు లక్ష్యాలను నాశనం చేయగలదు. చైనా మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. దీన్ని సైన్యం చేతికి అప్పగించే దిశగా మరో ముందడుగు పడింది. అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న అగ్ని-5ను త్వరలోనే స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌(ఎస్‌ఎఫ్‌సీ)కు త్వరలోనే అందజేస్తామని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఎస్‌ఎఫ్‌సీకి అందజేసే ముందే వివిధ స్థాయుల్లో ఈ క్షిపణిని పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ క్షిపణితో చైనాలోని బీజింగ్‌ సహా షాంఘై, గాంఘూ, హాంకాంగ్‌లను లక్ష్యంగా చేసుకోవచ్చు. అగ్ని-5క్షిపణిని గత నెలలో విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగంలో నిర్దేశిత లక్ష్యాన్ని అస్త్రం ఛేదించింది.

అగ్ని శ్రేణిలోని మిగతా క్షిపణుల కన్నా అగ్ని-5 చాలా అధునాతనమైనది. దీని దిక్సూచి, మార్గనిర్దేశ, వార్‌హెడ్‌, ఇంజిన్‌ చాలా మెరుగైనవి. కొత్తగా సిద్ధం చేసిన అనేక పరిజ్ఞానాలను ఈ అస్త్రంలో చొప్పించారు. నేవిగేషన్‌ వ్యవస్థలు, అత్యంత కచ్చితత్వంతో కూడిన రింగ్‌ లేజర్‌ జైరో ఆధారిత ఇనర్షియల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ (ఆర్‌ఐఎన్‌ఎస్‌), అధునాతన మైక్రో నేవిగేషన్‌ వ్యవస్థ (ఎంఐఎన్‌ఎస్‌) వంటివి ఈ క్షిపణిని నిర్దేశిత లక్ష్యానికి అత్యంత కచ్చితత్వంతో చేరవేస్తాయి. దీని కచ్చితత్వంలో తేడాలు కేవలం కొన్ని మీటర్ల మేర మాత్రమే ఉంటాయి. క్షిపణిలో అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్‌, లోపాలకు తావులేని సాఫ్ట్‌వేర్‌, పూర్తిస్థాయి డిజిటల్‌ నియంత్రణ, అధునాతన కంపాక్ట్‌ ఏవియానిక్స్‌ ఇతర వ్యవస్థలు ఉన్నాయి. ఈ క్షిపణి రేంజి 1.5 టన్నుల పేలోడ్‌తో 5,000 కిలోమీటర్లు అని అధికారులు చెబుతున్నా.. పేలోడ్‌ను తగ్గించి దానిని 8,000 కిలోమీటర్ల వరకు పెంచవచ్చు.

ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌, ఉత్తర కొరియాలు మాత్రమే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని కలిగి ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా ఈ దేశాల సరసన చేరింది. ప్రస్తుతం భారత అమ్ముల పొదిలో అగ్ని-1 (700 కి.మీ.), అగ్ని-2 (2000కి.మీ.), అగ్ని-3, అగ్ని-4 (2,500 కి.మీ -3,500కి.మీ) లక్ష్యాలను సులభంగా ఛేదించగలవు. అగ్ని-5 తొలి పరీక్ష ఏప్రిల్‌ 19, 2012లో చేయగా, ఐదోసారి జనవరి 18, 2018న చేశారు. ఐదోసారి అగ్ని-5 విజయవంతమైంది. భారత ఆయుధ సంపత్తిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సూపర్‌సోనిక్‌ మిసైల్‌ బ్రహ్మోస్‌ను సుఖోయ్‌ యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.