చైనా సముద్రంలో డ్రాగన్ హంగామా
నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ హంగామా పెరిగిపోయిది. నాలుగురోజులపాటు నాన్‌స్టాప్ యుద్ధవిన్యాసాల పేరిట క్షిపణి ప్రయోగాలు, ఫైటర్ జెట్‌ల విన్యాసాలు చేపట్టింది. ఓ రకంగా పెలోసీ పర్యటన ఆసియా ప్రాంతంలో డ్రాగన్ ప్రతిష్ఠకు గండి కొట్టింది. వాస్తవానికి పెలోసీ పర్యటనతో దక్షిణ చైనా సముద్రంలోని చైనా బాధిత దేశాలు అమెరికా దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మరికొన్నాళ్లలో మూడోసారి పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్న షీ జిన్‌పింగ్‌కు ఈ పర్యటన పెద్ద ఎదురు దెబ్బ. ఆయన ఇమేజ్‌ను దెబ్బతీయడం ఖాయం.నాన్సీ పెలోసీ విమానంతోపాటు చైనా విమానం కూడా తైవాన్‌లో ల్యాండ్ అవుతుందంటూ గ్లోబల్ టైమ్స్ కొన్నాళ్ల క్రితం కథనం ప్రచురించింది. రోజులు గడిచాయి.. నాన్సీపెలోసీ విమానం ఎలాంటి అడ్డంకులు లేకుండా అమెరికా రక్షణ ఛత్రంలో తైవాన్ చేరింది. అక్కడే దాదాపు ఒక పూటకు పైగా ఉండి.. ఆ తర్వాత దక్షిణ కొరియా దిశగా ఎగిరిపోయింది.వాస్తవానికి అప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. ఐరోపా మిత్రులకు మద్దతుగా ఉక్రెయిన్ సైన్యాన్ని వెనకుండి నడిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక నష్టాలను తట్టుకొనేందుకు సిద్ధపడిపోయింది.మరో వైపు పెలోసీ తైవాన్ పర్యటనకు రోజుల ముందు అల్‌ఖైదా అగ్రనేత అల్-జవహరీని అఫ్గాన్ భూభాగంపైనే అమెరికా డ్రోన్ మట్టుబెట్టింది. ఈ క్రమంలో తాలిబన్ల అనుమతి లేకుండానే డ్రోన్లు అఫ్గాన్ గగనతలాన్ని చేరుకొని.. లక్ష్యాన్ని నేలకూల్చి సురక్షితంగా తిరిగి వచ్చాయి. తాలిబన్లు నిరసన తెలియజేస్తూ ప్రకటనలు తప్ప మరేమీ చేయలేకపోయారు.ఆ తర్వాత నాన్సీ తైవాన్ పర్యటనను సురక్షితంగా ముగించారు. ఈ క్రమంలో అమెరికా క్యారియర్ గ్రూప్‌నకు చెందిన యుద్ధ నౌకలు నేరుగా చైనా సమీప జలాల్లోకి చేరుకొన్నాయి. ఒకే సమయంలో ప్రపంచంలోని వేర్వేరు చోట్ల వాషింగ్టన్ ఆపరేషన్లు నిర్వహించడం చూస్తే.. అమెరికాయే ఇప్పటికీ సూపర్ పవర్ అనే విషయాన్ని డ్రాగన్‌కు స్పష్టంగా చెప్పినట్లైంది.తైవాన్‌ను ఆక్రమించుకొనే శక్తి సామర్థ్యాలు ఇప్పటికీ బీజింగ్‌కు లేవని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తైవాన్‌ను ఆక్రమించుకొనే కంటే.. దాని ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీయడం తేలికని చైనా భావించింది. అందుకే తైవాన్‌ను దాదాపు చుట్టుముట్టి ఆరు వైపుల నుంచి యుద్ధ విన్యాసాలను చేపట్టింది. తాము తలచుకొంటే తైవాన్‌ను పూర్తిగా ముట్టడించగలమని చెప్పేందుకు వీటిని చేపట్టిందని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు బ్రయాన్ క్లార్క్ విశ్లేషించారు. ఈ విన్యాసాల కారణంగా నౌకాశ్రయాలు, వైమానిక మార్గాల్లో కార్గో రవాణాలో కొంత జాప్యం చోటు చేసుకోవచ్చు. తైవాన్ వద్ద సైనిక సంక్షోభం మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేయాలని చైనా వీటిని చేపట్టింది. దీంతోపాటు తైవాన్ సమీపంలో యుద్ధ విన్యాసాలు నిత్యకృత్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాంతంలోకి నౌకలను పూర్తిగా రానీయకుండా చేయడాన్ని యుద్ధం ప్రకటించడంతో సమానంగా(యాక్ట్ ఆఫ్ వార్) ప్రపంచ దేశాలు భావించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తరచూ ఈ ప్రాంతాన్ని బ్లాకేడ్ చేసే అవకాశంపై చైనా సైనిక పత్రికల్లో చర్చలకు వస్తోంది.చైనా నేరుగా యుద్ధం చేసి లక్ష్యాన్ని సాధించాలనుకోవడంలేదని ర్యాండ్ కార్పొరేషన్ పరిశోధకుడు, మాజీ నేవీ అధికారి బ్రాడ్లీ మార్టీన్ అభిప్రాయపడ్డారు. యుద్ధం కంటే తక్కువ స్థాయిలో శక్తి ప్రదర్శన చేయడమే చైనా ఉద్దేశమని పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థికంగా అమెరికా మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా, కెనడాల వంటి వాటిని వేధించే అవకాశాలు ఉన్నాయి.తాజాగా తైవాన్ గగనతలం మీదుగా చైనా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని తైవాన్ సమీపంలో పడ్డాయి. మరోవైపు ఐదు క్షిపణులను జపాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లోకి ప్రయోగించింది. ఇటువంటి చోట్ల క్షిపణులు పడటం జపాన్‌కు కొత్తేమీ కాదు. గతంలో ఉత్తర కొరియా క్షిపణులు కూడా ఇక్కడపడ్డాయి. కానీ, ఈ సారి చైనా ఆ పనిచేయడం కొంత ఆందోళనకరం. జపాన్‌లోని ఒకినావాలో అమెరికాకు అతిపెద్ద సైనిక స్థావరం ఉన్న విషయం తెలిసిందే. తైవాన్‌నే కాదు.. అమెరికా బేస్‌లను కూడా లక్ష్యంగా చేసుకోగలననే సంకేతాలు పంపేందుకు ఈ చర్యలని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ బడ్జెటరీ సంస్థ అధ్యక్షుడు థామస్ జి. మహనకెన్ పేర్కొన్నారు.చాలా దూరంలో ఉంది. చైనా ప్రాథమికంగా సమీపంలోని అమెరికా స్థావరాలపై దాడి చేసి నష్టపర్చగలదు. కానీ, అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాంలు చైనా తీర ప్రాంతంతోపాటు.. ప్రధాన భూభాగాన్ని దాదాపు చుట్టేసే ఉంటాయి. వీటికి తోడు గువాం సైనిక స్థావరం ఉండనే ఉంది. వీటి సమీపం నుంచి అమెరికా నేరుగా చైనా ఆర్థిక ఆయువుపట్టు వంటి నగరాలపై దాడి చేసే అవకాశాలున్నాయి. ఇదే చైనాను దూకుడుగా ముందుకు వెళ్లనీయదు.