చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో అవగాహన
జూలూరుపాడు, అక్టోబర్ 12, జనంసాక్షి: ఛైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో పాపకొల్లు ఆటో డ్రైవర్లకు పలు వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ ఫండ్ ఇండియా సూపర్వైజర్ మధుబాబు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో పాటు హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి సుఖ వ్యాధులపై సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదని, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను అంటరాని వారిగా చూడకూడదని వారిని ఆదరించి ఆసరా కల్పించాలని కోరారు. హెచ్ఐవి వ్యాధికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అని ఈ హెచ్ఐవి నివారణ కేవలం కండోమ్ వాడటం వల్లనే సాధ్యమని వివరించారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఒకరు చేసే రక్తదానం వలన నలుగురు ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మహేష్ యూనియన్ సెక్రటరీ భద్రం, లింక్ వర్కర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.