చౌడేశ్వరి అమ్మవారి కృపతో మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందాలి

— అమ్మవారి జయంతి ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్
 మహబూబ్ నగర్, జూలై 28,( జనంసాక్షి ) :  మహబూబ్ నగర్ అంటేనే భిన్న మతాలు, కులాలకు నిలయంగా మారిందని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలు కమ్యూనిటీ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాలు, నిధులు అందించి అండగా ఉంటున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ వీరన్నపేటలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అన్ని కులాలు, మతాలకు చెందిన పేదలకు తమ ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. కులవృత్తులపై ఆధారపడిన వారందరికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలో వీరన్నపేట ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాలనీ, త్వరలో రానున్న బైపాస్ రోడ్డులో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారుతోందని తెలిపారు. అమ్మ వారి కృపతో రాష్ట్రం, మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, తోగట వీర క్షత్రియ సంఘం నేతలు చంద్రమౌళి, బాలయ్య, కురుమూర్తి, లక్ష్మినారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.