జకీర్‌ను పంపేదిలేదు… 

– ఇండియాకు మలేసియా షాక్‌..!
న్యూఢిల్లీ, జులై6(జ‌నం సాక్షి ) : వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయక్‌ను ఇండియాకు పంపేది లేదని మలేసియా ప్రధాని మహతిర్‌ మొహమ్మద్‌ శుక్రవారం స్పష్టం చేసినట్టు ‘స్టైట్ర్‌ టైమ్స్‌’ పేర్కొంది. మలేసియాలో జకీర్‌ తలదాచుకున్నట్టు ఇటీవల కొన్ని ఫోటోలు వైరల్‌ అయ్యాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు, మతోన్మాదం నూరిపోయడం, మనీ లాండరింగ్‌ సహా పలు కేసుల్లో చిక్కుకున్న జకీర్‌ కొద్దికాలం క్రితం విదేశాలకు పరారయ్యాడు. ఆయనను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మలేసియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్వరలోనే ఇండియాకు తిరిగి వస్తున్నానన్న వార్తలను నాయక్‌ సైతం గత బుధవారంనాడు తోసిపుచ్చారు. అవన్నీ నిరాధరమైన, తప్పుడు కథనాలేనన్నారు. ఇండియాలో ప్రాసిక్యూషన్‌ సరిగా జరుకుందనే నమ్మకం కుదిరేంత వరకూ స్వదేశానికి వెళ్లేది లేదని ఆయన చెప్పారు. కాగా, జకీర్‌ను ఇండియాకు పంపేది లేదని మలేసియా ప్రధాని పేర్కొన్న విషయం తమకు తెలియదని ఎన్‌ఐఏ ప్రతినిధి అలోక్‌ మిట్టల్‌ తెలిపారు. అలాంటి సమాచారం ఏదీ తమ వద్ద లేదని, నిజానిజాలు విచారిస్తామని చెప్పారు. ఇండియాలో విద్వేష ప్రసంగాలు, మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌ అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. బ్రిటన్‌లో జకీర్‌పై నిషేధం ఉన్నప్పటికీ ఆయనకు మలేసియాలో శాశ్వత నివాసం లభించడం ఉన్నతాధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మలేసియాలోని పుత్రజయలో 2016 నుంచి జకీర్‌ తలదాచుకుంటున్నారు. కాగా, జకీర్‌ను ఇండియాకు అప్పగిస్తే ప్రజల దృష్టిలో మతపరమైన విశ్వసనీయతను కోల్పోతామని మలేసియా సర్కార్‌ ఆలోచనగా తెలుస్తోంది.