జగిత్యాల నుంచే మా జైత్రయాత్ర

వందసీట్లు గెల్చుకుని కెసిఆర్‌కు కానుకగా ఇస్తాం

జీవన్‌ రెడ్డిని ఓడించి తీరుతాం

కెసిఆర్‌ తనయనే కాదు.. ఉద్యమ తనయను కూడా

జగిత్యాల ప్రచారంలో ఎంపి కవిత ఘాటు వ్యాఖ్యలు

జగిత్యాల,నవంబర్‌21(జ‌నంసాక్షి): జగిత్యాల నుంచి టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లను సాధిస్తామని, జగిత్యాలను గెలుచుకొని కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో కవిత రోడ్‌ షోలలో పాల్గొన్నారు. జగిత్యాల మండలంలోని ధరూర్‌, నర్సింగాపూర్‌, వంజర పల్లి, గొల్లపల్లి, వెల్దుర్తి, మోతే, చల్‌ గల్‌ మోర పల్లి గ్రామాల్లో జరిగిన రోడ్‌ షోలో కవిత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాయికల్‌ మండలంలోని సింగరావుపేట, అల్లీపూర్‌, అయోధ్య, ఉప్పు మడుగు, కుమ్మర్‌ పల్లి, రాయికల్‌ మండల కేంద్రంలో ఎంపీ కవిత ప్రసంగించారు. సింగరావు పేట, అల్లీపూర్‌ లలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పలుచోట్ల మహిళలు ఎంపీ కవిత కు మంగళ హారతులు పట్టారు. రాయికల్‌లో బంతిపూలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్చుతూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆనందంతో డ్యాన్స్‌ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా జీవన్‌ రెడ్డి, ఎల్‌ రమణ ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఇన్నేళ్లు ఒకరినొకరు తిట్టుకున్నారు.. అవినీతికి పాల్పడ్డారు.. ఈ విషయం ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు. కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన కవల పిల్లల మాదిరిగా ఇప్పుడు ఒకటే ప్రేమ ఒలకబోస్తున్నారు అని అన్నారు. జగిత్యాలకు ఎనిమిది వందల కోట్ల రూపాయలను తెచ్చిన కేసీఆర్‌ ముద్దుల తనయ వాటి లెక్కలు చెప్పు అని జీవన్‌ రెడ్డి అడిగారని, ఎనిమిది కాదు 12 వందల కోట్లు తెచ్చామని లెక్కలు చెప్తే ఇప్పుడు చప్పుడు చేయడం లేదని అన్నారు. తాను కేసీఆర్‌ ముద్దుల తనయనే కాదు.. తెలంగాణ ఉద్యమ తనయనని కవిత చెప్పారు. జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కానీ ఆయన మాట విూద నిలబడరని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజల కడుపులో తలపెట్టి ఇదే ఆఖరి సారి అని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్న జీవన్‌ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని తెలిపారు. రాజకీయ నాయకులు మాట విూద నిలబడాలి, అలా నిలబడలేని వారు ప్రజలకు ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు.

కూటమి పేరిట జట్టు కట్టిన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, జనసమితి.. కేసీఆర్‌ను గ్దదె దించుతామంటున్నాయని చెప్పారు. అసలు కేసీఆర్‌ను ఎందుకు గ్దదె దించాలో చెప్పాలని కూటమి నాయకులను ప్రశ్నించాలని ప్రజలను ఎంపీ కవిత కోరారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నందుకా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లు ఖర్చు భరిస్తున్నందుకా, కేసీఆర్‌ కిట్ల ద్వారా పేదింటి మహిళకు కడుపు పండిన నాటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు 12 వేల రూపాయలు ఇస్తున్నందుకా, రైతుబంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నందుకా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు పండుగకు, పబ్బాలకు కొత్తబట్టలు పెడుతూ గౌరవంగా పండుగను జరుపుకునేందుకు సాయం చేస్తున్నందుకా, మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడుతున్నందుకా కేసీఆర్‌ ను గ్దదె దించాలని కుంటున్నది.. అని అడగాలని కవిత ప్రజలను కోరారు.

అన్ని కులాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు కేసీఆర్‌ ఒక కార్యక్రమాన్ని రూపొందించారని.. ఎన్నికలయ్యాక దాన్ని కార్యాచరణలోకి తీసుకువస్తారని తెలిపారు. రైతులకు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని, నిరుద్యోగులకు 3000, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాన్ని, పెన్షన్‌ అర్హత వయసు ను 65 నుండి 58 ఏళ్ల కు తగ్గిస్తామని వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి జగిత్యాలలో సంజయ్‌ అన్నను గెలిపించాలని ఎంపీ కవిత ప్రజలను కోరారు. రోడ్‌ షోలలో టీఆర్‌ఎస్‌ జగిత్యాల అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, రమణారావు, చంద్రశేఖర్‌ గౌడ్‌, భోగ వెంకటేశ్వర్లు, చక్కిలం కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.