జనారణ్యంగా మారిన మేడారం
మేడారం మహాజాతరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సేవలను గురువారం తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సభాపతి, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం దంపతులు మేడారం జాతరకు బయలుదేరారు. ఇవాళ, రేపు హెలికాప్టర్ సేవలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. హైదరాబాద్-మేడారం, వరంగల్-మేడారం వరకు హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. వరంగల్ నుంచి మేడారం వరకు ఒకరు వెళ్లి రావడానికి టికెట్ ధర రూ.26,500లుగా నిర్ణయించారు. హైదరాబాద్-మేడారం నలుగురికి ప్యాకేజీ ధర రూ.2,75,000లు గా నిర్ణయించారు.
స్వల్ప అగ్నిప్రమాదం
మేడారం మహాజాతర సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన గుడారాల్లో గురువారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. భక్తులు వంట చేస్తుండగా ఓ గుడారానికి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని స్థానికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.