జమ్మూకాశ్వీర్‌లో బీజేపీ 

అరాచకాన్ని సృష్టించింది
బిజెపి విఫలమై, పిడిపిని దోషిగా చూపింది
గత ప్రభుత్వమే నయమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు
సమానా ఎడిటోరియల్‌లో బీజేపీపై విరుకుపడ్డ శివసేన
ముంబయి, జూన్‌21(జ‌నం సాక్షి) : బిజెపిపై శివసేన గురువారం పలు విమర్శలు చేసింది. జమ్ము కాశ్మీర్‌లో బిజెపి అరాచకాన్ని సృష్టించి, అనంతరం బిజెపి అధికారం నుండి తప్పుకుందని సమానా వార్త పత్రిక సంపాదకీయంలో ఆరోపించింది. దురాశ కోసం పార్టీ చేసే పనులను చరిత్ర ఎప్పటికి క్షమించదని పేర్కొన్నారు. ఉత్తర భారత్‌లో ఉగ్రవాదం, హింసాకాండను అణచివేయడంలో బిజెపి విఫలమందని, కానీ పీపుల్‌ డెమొక్రటిక్‌ పార్టీపై ఆరోపణలు చేసిందని పేర్కొంది. పిడిపి నుండి బిజెపి వైదొలగడాన్ని భారత్‌ నుండి బ్రిటీష్‌ పారిపోయిందని పోల్చింది. అనంతరం ప్రధాన మంత్రిపై కూడా పలు విమర్శల దాడి చేసింది. జమ్ము కాశ్మీర్‌లో పిడిపి నుండి బిజెపి తన మద్దతు ఉపసంహరణ అనంతరం, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయగా, ఈ నెల 20నుండి రాష్ట్రంలో గవర్నర్‌ పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.’లోయలో అరాచకత్వం విస్తరించిన తర్వాత బిజెపి ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలిపివేసింది’ అని పేర్కొంది.. ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఊహించనేలేదని, రక్తం ఏరులై పారలేదని, అంతక ముందు ఎక్కువ సంఖ్యలో జవాన్లు తమ ప్రాణాలను కోల్పోలేదని, ఇవన్నీ లోయలో బిజెపి పాలనలో జరుగుతోందని, కాగా, పిడిపిపై ఆరోపణలు గుప్పించి పెద్దమనిషి వలె అధికారం నుండి తప్పుకుందని చమత్కరించింది. దురాశతోనే కాశ్మీర్‌లో (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ దురాశ మూలంగా రాష్ట్రంలోని జవాన్లు ప్రజల దేశం భారీ మూల్యాన్ని చెల్లించాల్చి వచ్చిందని సంపాదకీయంలో పేర్కొంది. కాశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం చేయడానికి పరిష్కారం ఉందని హావిూనిచ్చిన అనంతరం మోడీ, ఆయన పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాయని పేర్కొంది.
గత ప్రభుత్వమే నయం…
కాశ్మీర్‌లోని కాంగ్రెస్‌ (కాంగ్రెస్‌) నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సంకీర్ణంలోని గత ప్రభుత్వం మంచిదని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారని, ప్రతిరోజు సైన్యంపై ప్రజలు దాడి చేస్తున్నారని, ఉగ్రవాదులు సైన్యం స్థావరాలపై దాడులు చేస్తున్నారని, దీని వల్ల సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్నాయని శివసేన పేర్కొంది. అమరులైన వారికి కుటుంబ సభ్యులకు రక్షణ శాఖ మంత్రి ట్విట్టర్‌ ద్వారా సంతాపాన్ని తెలుపుతారని వ్యంగ్యంగా పేర్కొంది. మోడీ తరచూ విదేశీ పర్యటనలు వెళ్ళడంపై స్పందిస్తూ మోడీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తుంటే, కానీ ఐక్యరాజ్యసమితి కాశ్మీర్‌లో హింసాత్మక ఘటనపై మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రభుత్వాన్ని నిందిస్తుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370పై హావిూని ప్రశ్నించింది. తీవ్రవాదం వెయ్యి రెట్లు పెరిగిందని, పాకిస్తాన్‌ చొరబాట్లు పెరిగాయని విమర్శించింది. యుద్ధాలు లేనప్పటికీ సైనికుల మరణాలు పెరిగాయని పేర్కొంది. వీటన్నింటిలో బిజెపి విఫలమై, పిడిపిని నిందించిందని పేర్కొంది. బ్రిటిష్‌ వాళ్లు కూడా ఈ విధంగానే చేశారని ఆరోపించింది.