జమ్మూలో ప్రభుత్వ ఏర్పాటుకు.. 

బీజేపీ ప్రయత్నాలు
– అమర్‌నాథ్‌ యాత్ర తరువాత ప్లాన్‌ అమలుకు చర్యలు
– ఆసక్తిగా మారుతున్న జమ్మూ రాజకీయాలు
న్యూఢిల్లీ, జులై6(జ‌నం సాక్షి ) : జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. పీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన తర్వాతే జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలు రాజకీయ సవిూకరణాల దృష్ట్యా గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రను కూడా మార్చే అవకాశం ఉంది. 87అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో పీడీపీకి 28 మంది, బీజేపీకి 25 ఎమ్మెల్యేల బలం ఉంది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ)తో మూడున్నరేండ్ల పాటు సాగిన పొత్తుకు జూన్‌ 19న బీజేపీ గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ట్రపతి కోవింద్‌.. జమ్మూకశ్మీర్‌ లో గవర్నర్‌ పాలనకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ లో గవర్నర్‌ పాలన కొనసాగుతుంది. ఇదిలా ఉంటే పీడీపీ నేత, మాజీ సీఎం ముఫ్తీపై ఆ పార్టీకిచెందిన పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు పలువురు ఎమ్మెల్యేలు ఆమె చేజారుతుండటం, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పాలవులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.