జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలనే కొనసాగిస్తాం

– బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు
– బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌
కాశ్మీర్‌, జులై7(జ‌నం సాక్షి) : పీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి జమ్మూ కశ్మీర్‌లో తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ శనివారం ఖండించారు. కశ్మీర్‌లో శాంతి, పరిపాలన, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గవర్నర్‌ పాలనే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు రాంమాధవ్‌ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. పెద్ద సంఖ్యలో పీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని, జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందనే సమాచారం ఉందంటూ ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘రాంమాధవ్‌ చెప్పినదానికి విరుద్ధంగా, పీడీపీలో చీలిక తీసుకురావడానికి జమ్మూ కశ్మీర్‌ బీజేపీ ప్రయత్నిస్తోంది.. అధికారం కోసం ఎంతటి మూల్యాన్నానైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంది’ అని రాంమాధవ్‌ను ట్యాగ్‌ చేస్తూ ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ సంధించారు. దీనికి ట్విట్టర్‌ ద్వారా సమాధానం ఇచ్చిన రాంమాధవ్‌.. ‘ఇందులో నిజంలేదు.. రాష్ట్ర విభాగంలో నేను తప్పనిసరిగా తనిఖీ చేస్తాను.. లోయలో ఉన్న ఇతర పార్టీలలో జరిగే పరిణామాలకు బీజేపీతో సంబంధం ఉండదు’అని అన్నారు. కశ్మీర్‌లో సుస్థిరత కోసం గవర్నర్‌ పాలనను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్‌ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా రాంమాధవ్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కావడానికి వారం రోజుల ముందే జమ్మూ కశ్మీర్‌లోని పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలు ముందుకు రాకపోవడంతో గవర్నర్‌ పాలన విధించారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ పాలనా బాధ్యతలను గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా నిర్వహిస్తున్నారు.