జయశంకర్‌ సార్‌ను విస్మరించడం సరికాదు

4

– వర్ధంతి జయంతి సర్కారే నిర్వహించాలి

– మల్లన్నసాగర్‌ రైతాంగానికి అండగా ఉంటాం

హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి): ప్రొ.జయశంకర్‌ వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తనకు బాధ కలిగించిందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జాతిపిత అనుకుంటున్న సార్‌ వర్ధంతిని విస్మరించడం సరికాదన్నారు. కనసీం వచ్చే యేడైనా ఈ పొరపాటు లేకుండా చూసుకోవాలని కోరుతూ,  మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో  గురువారం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాదైనా ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసుకోవాలని కోదండరామ్‌ సూచించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను విస్మరించడం మంచిది కాదని  అన్నారు. ప్రజలు తమ హక్కులు సాధించుకునేలా చట్టాలపై అవగాహన కలిగించి చైతన్య పరుస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై హైదరాబాద్‌ నాంపల్లిలోని ఐకాస కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ… మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నమూనాను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అటు న్యాయవాదుల సమ్మె రోజుల తరబడి జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. వీరి సమస్యను కేందరమే పరిష్కరించాలన్నారు. హైకోర్టు విభజనను ఇంకా పెండిండ్‌లో పెట్టి రెండేళ్లుగా కాలయాపన చేయడం సరికాదన్నారు.   ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జూన్‌ 30న ప్రభావిత గ్రామాల్లో పర్యటించనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. ఓసిలను వద్దన్న డిమాండ్‌ మేరకు పరిశీలన చేసి ప్రజలను కలుస్తామని అన్నారు.