జర్నలిస్టును హత్య చేసి, శవాన్ని పూడ్చేశారు

భోపాల్: కోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించిన నిందితులు చివరికి ఒక విలేకరిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ జిల్లా కోటంగి ప్రాంతంలో నివాసం ఉంటున్న సందీప్ కోఠారి (42) అనే వ్యక్తి హత్యకు గురైనాడు. సందీప్ కోఠారి హిందీ దిన పత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు. ఇతను రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక దందా, భూ కబ్జాల మీద అనేక వార్తలు రాశాడు. అదే విధంగా కోర్టులో కేసు పెట్టాడు. కేసు వెనక్కి తీసుకోవాలని నిందితులు చాల సార్లు సందీప్ ను బెదిరించారు. అందకు సందీప్ నిరాకరించాడు. శుక్రవారం కోటంగి ప్రాంతంలో ఉన్న సందీప్ ను కొందరు కిడ్నాప్ చేశారు. తరువాత దారుణంగా బ్రతికి ఉన్నట్లే నిప్పంటించి హత్య చేశారు. చివరికి మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలోని అటవి ప్రాంతంలో మృతదేహం పూడ్చివేశారు.  కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం బయటపెట్టారు. నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా మృతదేహం బయటకు తీసి ఆసుపత్రికి తరలించామని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో విలేకరి హత్య కేసులో యూపీ, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. హత్య కేసులో సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం స్పందించింది. రెండువారాల్లో స్పందించాలని సూచించింది. విలేకరుల రక్షణ పైన రాష్ట్రం, కేంద్రం మార్గదర్శకాలను తెలపాలని పిటిషన్ దారు కోర్టును కోరారు.