జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు అధికారులు సమిష్టి కృషిచేయాలి.
అదనపు కలెక్టర్ మను చౌదరి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్22(జనంసాక్ షి):
జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు ఇచ్చిన ఆన్లైన్ ప్రశ్నావళికి సరైన జవాబులు నింపేందుకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ మను చౌదరి ఎంపిడిఓ లను ఆదేశించారు.జాతీయస్థాయి ఉత్తమ గ్రామాలు, మండలాల ఎంపికకు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల సమగ్ర వివరాల ను ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషిచేసి నాగర్ కర్నూల్ జిల్లా నుండి అధికంగా జాతీయ గ్రామపంచాయతీ అవార్డు పురస్కారాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు.గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశం మందిరంలో
జాతీయ పంచాయతి రాజ్ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తూ జారీ చేసిన ఆన్లైన్ ప్రశ్నావళి పై మండల అభివృద్ధి అధికారులు,ఎంపిఓ లకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. మొత్తం 9 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 9 థీమ్ లను పొందుపరచి 113 ప్రశ్నలను ఇవ్వడం జరిగిందన్నారు. 9 థీమ్ లలో పంచాయతీరాజ్, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం,గ్రామ పంచాయతి లలో మౌళిక సదుపాయాలు, జీవనోపాధి తదితర అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు పై ప్రశ్నలు ఇవ్వడం జరిగిందన్నారు.ఒక్కో ప్రశ్న పై అవగాహన కల్పించారు.గ్రామ స్థాయిలో పూర్తి అవగాహన కలిగి ఉండి పూర్తి డేటాతో ఉంటేనే ఆన్లైన్ లో ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వవచ్చన్నారు. జిల్లాలోని 20 మండలాల నుండి ఉత్తమమైన ఒక్కో గ్రామపంచాయతీ ని ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రాథమికంగా గుర్తించిన గ్రామ పంచాయతీ ల పంచాయతి సెక్రెటరీలు, ఎంపిడిఓ లు, ఎంపిఓ లకు ఈ నెల 27వ తేదీన హైద్రాబాద్ లోని టీఎస్ ఐపాడ్ లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఆన్లైన్లో ప్రశ్న పత్రాల విషయంలో శిక్షణ తరగతిలో పూర్తి అవగాహన చేసుకోవాలని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడే నివృత్తి చేసుకోవాలని సూచించారు.సరైన సమాచారంతో సమాధానాలు నింపి జిల్లా నుండి ఎక్కువ అవార్డులను సాధించేందుకు జిల్లా అధికారులు, ఎంపిడివోలు, ఎంపిఓ లు సమన్వయంతో పనిచేసి అత్యధిక అవార్డులు సాధించేలా కృషి చేయాలన్నారు. స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ, పారిశుధ్యం పై అవగాహన కల్పించాలని, విద్యార్థుల ద్వారా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ కృష్ణ, డిఆర్డిఓ నర్సింగరావు,డీఈఓ గోవిందరాజులు శిశు సంక్షేమ అధికారిని వెంకటలక్ష్మి, ఈ.ఈ ఇంట్ర శ్రీధర్ రావు, ఎంపిడిఓ లు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.