జాతీయ రాజకీయాలు లక్ష్యంగా కెసిఆర్ పాలన
జాతీయ రాజకీయాలు లక్ష్యంగా కెసిఆర్ తెలంగాణ పాలన ఉండబోతున్నదన్న సంకేతాలు ఇచ్చారు.
మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందో కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సిఎం కెసిఆర్ ఇక తన లక్ష్యాలను కూడా స్పష్టంగా ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఇంతకాలం తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తయితే …ఇక ముందు నుంచి మరో ఎత్తు కానున్నాయి. అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తూ దేశానికి ఆదర్శంగా ముందుకు సాగాలన్న లక్ష్యంతో ఉన్నారన్నది సుస్పష్టం. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో తెలంగాణ ఆదర్శంగా నిలిస్తేనే జాతికి సందేశం ఇవ్వగలరు. అదే లక్ష్యం ఇప్పుడు కెసిఆర్ ముందున్నది. మలివిడత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు యాత్ర విజయవంతం కావడం, సానుకూల ధరోణి వ్యక్తం కావడంతో ఇక రెట్టించిన ఉత్సాహంతో కెసిఆర్ ముందుకు సాగనున్నారు. ఈ క్రమంలో పార్టీ బాధ్యతలను కెటిఆర్‌కు అప్పగించిన కెసిఆర్, తన వెన్నంటి మంత్రివర్గంలో నడిచే వారు కూడా సమర్థులు కావాలని కోరుకోవడంలో తప్పులేదు.
రాష్ట్రంలో పాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని ముఖ్యమంత్రి ఎంపిలతో భేటీలో పరోక్షంగా చేసిన సూచనలే దీనికి నిదర్వనంగా చూడాలి. తన లక్ష్యాలకు అనుగుణంగా కొత్త మంత్రివర్గం కూర్పు ఉంటుందన్నది తేలిపోయింది. అయితే అందులో వ్యక్తులు ఎవరన్నది ఇక ముఖ్యం కాదు. ఎంత గట్టిగా పనిచేస్తారన్నదే ముఖ్యం. అదే సందర్భంలో పార్టీకి నష్టం కలిగించిన వారిపై వేటుకు వెనుకాడబోమని, అందులో భాగంగా వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా ఉన్నవారిలో కొందరికి ఉద్వాసన ఉంటుందని కూడా చెప్పారు. మంత్రివర్గం, పాలన, ఇతర అంశాలపై ఆయన
చాలా ధృడంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రధానంగా వచ్చే అన్ని ఎన్నికలతో పాటు, 16 లోక్‌సభ స్థానాలు లక్ష్యంగా గట్టి టీమ్‌తో ముందుకు వెళ్లాలన్న ధృడసంకల్పంతో కెసిఆర్ ఉన్నారు. కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయి. మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదు. అధికారులు, సిబ్బంది అలసత్వాన్ని సహించేది లేదు. శాఖల వారిగా ప్రగతి కనిపించాలి. 64 ఏళ్ల వయసులో నేను ఎందుకు కష్టపడుతున్నాను? ఈ చలిలో ఎందుకు తిరుగుతున్నాను? తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతిని కాంక్షిస్తూ పర్యటిస్తున్నానే తప్ప నాకేవిూ స్వార్థం లేదు. అందరిలోనూ ఇలాంటి ఆలోచనలు రావాలని నర్మగర్భంగానే కెసిఆర్ ఎంపిలతో భేటీలో అన్నట్లు సమాచారం. ఇదంతా ఆయన ముందుముందు ఎలా ఉండబోతున్నారో చెప్పడానికి చేసిన వ్యాఖ్యలుగాగానే భావించాలి. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిదురోజుల పర్యటనను పూర్తి చేసుకొని శుక్రవారం రాత్రి హైదారాబాద్ చేరుకున్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఒకసారి మొదలు పెట్టిన యాత్ర తరవాత మలివిడతగా చేపట్టిన పర్యటన ఓ రకంగా విజయవంతం అయ్యిందనే చెప్పాలి. వివిధ పార్టీలతో బేటీ సందర్బంగా వారు కూడా రాజకీయ మార్పు కోరుకుంటున్నారనే చెప్పాలి. 17 ఎంపి సీట్లతో ఏం చేస్తారంటూ ఎపి సిఎం చంద్రబాబు ఎద్దేవా చేసినా, గుణాత్మక మార్పు అన్నది రావాలని ప్రజల్లో కూడా బలంగా ఉంది. కాంగ్రెస్, బిజెపిల పాలనాతీరు ఎలా ఉంటుందో ఏడు దశాబ్దాలుగా ప్రజలు చూస్తున్న వేళ మార్పు అనివార్యం కానుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ పర్యటన విజయవంతమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేయడం వల్ల ప్రజల ఆలోచనా ధోరణి కూడా మారనుంది. కెసిఆర్ తన పర్యటనలో రాజకీయపార్టీల నేతలతోపాటు వివిధ
రంగాల్లో నిపుణులు, మేధావులను కలిసి చేసిన చర్చలు ఫలప్రదం కావడమే గాకుండా ఆయనలో ఉత్సాహాన్ని కూడా నింపాయనే చెప్పాలి. దేశంలో ప్రధాన సమస్యలకు పరిష్కారాలు, ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై కొంతకాలంగా వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. మూడునెలలుగా అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న కేసీఆర్.. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల ను ముమ్మరం చేయడం, అందుకు సనుకూల వాతావరణం ఉండడం వల్ల ప్రయత్నాలు మరింత ముమ్మరం కానున్నాయి. వచ్చే ఎన్నికల్లో జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ స్పష్టమైన మెజార్టీ రాదన్న విషయం తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఓటమితో మోడీపైనా ప్రజల్లో భ్రమలు తొలగాయి. అందుకే స్పష్టమైన ఎజెండా అంశాలతోనే కేసీఆర్ వివిధ పార్టీల నాయకులను కలసి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలత వచ్చింది. బీజేడీనేత, సీఎం నవీన్ పట్నాయక్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, ఉద్దేశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో మరోసారి భేటీ అవుదామని ఇరువురు నాయకులు చెప్పారు.ఢిల్లీలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ కావాల్సి ఉన్నా,ఆయన ముందుగా నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో కుదరలేదు. తానే స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలుస్తానని విూడియా ముందు ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ఆయన ప్రశంసించారు. కేసీఆర్ చొరవ ప్రశంసనీయమన్నారు.మొత్తంగా జాతీయరాజకీయాలు లక్ష్యంగా కెసిఆర్ విధానాలు, పాలనాతీరు ఉండబోతున్నదని స్పష్టం అవుతోంది.