జాబ్‌మేళాలో 80 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): శ్రీమతి రాజమణి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో వేములవాడ జెఎన్‌ఎం విద్యాసంస్థ్థలకు చెందిన బిఈడి కళాశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాలో సుమారు 80 మంది నిరుద్యోగ విద్యావంతులకు ఉద్యోగ నియామకపు పత్రాలు అందజేశారు. ట్రస్ట్‌ చేర్మెన్‌ ఈశ్వరగారి రమణ నేతృత్వంలో నిర్వహించిన ప్రపంచ దిగ్గజ కంపెనీలైన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు టెక్‌ మహేంద్ర, కాగ్నిజెంట్‌, కర్వి, మాన్‌పవర్‌, పోలారిస్‌లతో పాటు టాటా, వరుణ్‌ మోటార్స్‌, ఎస్‌బిఐ తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ మేళాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సుమారు 4 వందల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. అభ్యర్థులకు వివిధ అంశాలలో నిర్వహించిన ఇంటర్వ్యూల ద్వారా 80 మందిని ఎంపిక చేసిన అనంతరం వారికి ఆయా కంపెనీల తరపున నియామక పత్రాలు అందజేశారు. కాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఈ మేళాకు హాజరైనవారికి జెఎన్‌ఎం విద్యాసంస్థల చేర్మెన్‌ ఈశ్వరగారి నరహరి శర్మ ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించగా, కార్యక్రమంలో జిల్లా జెఏసి గౌరవాధ్యక్షులు, అడ్వకేట్‌ నేరెళ్ళ తిరుమల్‌ గౌడ్‌, చేర్మెన్‌ బొజ్జ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.