జిజిహెచ్‌లో కార్పోరేట్‌ వైద్యం

మంత్రి రంగనాథ్‌ రాజు

గుంటూరు,నవంబర్‌11 (జనంసాక్షి): సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి రంగనాథ్‌ రాజు తెలిపారు. జీజీహెచ్‌లో జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి రంగనాథ్‌ రాజు, ఎమ్మెల్యేలు గిరిధర్‌, ముస్తఫా పర్యటించారు. నిర్మాణంలో ఉన్న రోగుల బంధువుల సహాయకుల విశ్రాంతి గది భవన పనులను పర్యవేక్షించారు. ఉచితంగా భోజనం పెట్టేందుకు కోటి రూపాయలు మంత్రి విరాళంగా అందించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర ముగిసి మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో కార్పోరేట్‌ హాస్పిటల్‌ కంటే ధీటైన వైద్యం అందిస్తున్నారు. కోవిడ్‌ రోగులకు అత్యున్నతమైన సేవలు జీజీహెచ్‌ సిబ్బంది అందించారు. ఎన్‌జీవోల సహాయంతో నిర్మించిన భవనాన్ని రోగుల సహాయకులకు వినియోగించమని కోరారు. డిసెంబర్‌ నాటికి భవనాన్ని పూర్తి చేసి రోగుల సహాయలకు ఉచితంగా భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. జీజీహెచ్‌ ఉన్నంత కాలం ఉచిత భోజన సదుపాయం కొనసాగిస్తాం. ఆస్పత్రి అభివృద్ధికి రూ.300 కోట్లను మంజూరు చేస్తూ క్యాబినెట్‌లో నిర్ణయించాం. ఆ నిధులను తల్లి, బిడ్డల సౌకర్యాల కల్పనకు వినియోగిస్తాం’ అని మంత్రి వెల్లడించారు.