జిల్లాలో ఉగ్ర లింకులపై ఎన్‌ఐఎ దృష్టి

నవీద్‌కు చెందిన ఆర్థిక లావాదేవీలపై ఆరా
12న విచారణకు రావాలని ఆదేశం
పాస్‌పోర్ట్‌,బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌ చేసినట్లు సమాచారం
నిజామాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో ఉగ్ర లింకులపై ఎన్‌ఐఏ ప్రత్యేక నిఘా పెట్టారు. ఆర్మూర్‌కు చెందిన షేక్‌ నవీద్‌ వ్యవహారాలపై విచారణ వేగవంతం చేశారు. నవీద్‌ పాస్‌పోర్టు, బ్యాంక్‌ ఖాతాలు, సెల్‌ఫోన్లను ఎన్‌ఐఏ సీజ్‌ చేసింది. అలాగే ఆగస్టు 12న విచారణకు రావాలని ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన డబ్బు ఎటు వెళ్లిందనే కోణంలో విచారణ చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఉగ్రకదలికలపై జాతీయ దర్యా ప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆదివారం జిల్లాలోని ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయత్‌ నగర్‌లో సోదాలు నిర్వహించి అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నా రు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఆయువకుడిని విచారించి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం అధికారుల సమన్వయంతో విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వారికి సంబంధించిన కీలకమైన ఫోన్‌లు, ఇతర వస్తువులను ఎన్‌ఐఏ అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జిల్లాకు అకస్మాత్తుగా ఎన్‌ఐఏ అధికారులు రావడంతో జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌లోని ఓ యువకుడికి ఇతరప్రాంతాల నుంచి నిధులు రావడం, విదేశాలకు తరచూ ఫోన్‌ మాట్లాడుతుండడం గుర్తించి ఎన్‌ఏఐ అధికారులు ఆదివారం యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో యువకుడిని విచారించారు. అతనికి సంబంధించిన ఫోన్‌ డాటాను పరిశీలించడంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఎక్కడెక్కడి నుంచి అతనికి నిధులు వచ్చాయి. ఎవరు పంపారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మరొకరిని నిజామాబాద్‌కు తీసుకువచ్చి మరోసారి విచారించి నోటీసులు అందజేశారు. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. స్థానిక పోలీసులను కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు నజర్‌ పెట్టాలని కోరినట్లు సమాచారం. ఆ యువకునికి సంబంధించిన ఫోన్‌, పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర వస్తువులను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. యువకుడికి సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలించినట్లు సమాచారం. కుటుంబం పేదరికంలో ఉండడం వచ్చిన నిధులు ఎటువెళ్లాయో ఎన్‌ఐఏ అధికారులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.అయితే ఎన్‌ఐఏ అధికారులు యువకుడికి సంబంధించి ఎలాంటి విషయాలను ప్రకటించకపోయినా తీవ్రవాద కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపైనే ఆరా తీసినట్లు తెలుస్తోంది. గత నెలలోనే పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కొంతమందిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కార్యకలాపాలపై నిఘాపెట్టారు. సుమారు 300 మంది వరకు శిక్షణ ఇవ్వడంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఐదుగురిని అరెస్టుచేసిన పోలీసులు ఈ కేసులో 29 మందిపై కేసు నమోదు చేశారు. మిగతావారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత సంవత్సరం పాస్‌పోర్ట్‌ల జారీ కూడా జాతీయస్థాయిలో చర్చకు దారి తీసింది. బోధన్‌ కేంద్రంగా 75 మందికి పైగా రోహ్యింగాలు, ఇతరులకు ఒకటే ఇంటి నుంచి పాస్‌పోర్టులు జారీకావడంతో జిల్లా పోలీసులతో పాటు కేంద్ర నిఘా విభాగం, ఎన్‌ఐఏ అధికారులు కూడా దర్యాప్తు
చేపట్టారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం ఏదో రూపంలో ఇలాంటి కార్యక్రమాలు బయటపడుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్‌ వింగ్‌తో పాటు ఎస్‌బీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ కూడా మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు.