జిల్లాలో ఎస్‌పిజి అధికారుల పర్యటన
ప్రధాని, రాహుల్ సభలతో ప్రత్యేక పరిశీలన
రాహుల్ సభ భద్రతపై అధికారుల ఆరా
నిజామాబాద్,నవంబర్27(జనంసాక్షి): ఎన్నికల సభలతో పోలీసులు బిజీగా మారారు. నిజామాబాద్‌లో మంగళవారం ప్రధాని మోడీ సభతో ఎస్‌పిజి దళాలుప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందే వచ్చి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఇప్పుడు ఆర్మూర్‌లో ఈ నెల 29న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే బహిరంగసభకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రత్యేక రక్షణ బృందం (ఎస్‌పీజీ) అధికారులు పరిశీలించారు. ఎస్‌పీజీ ఏఐడీజీ దీపక్ మన్వాల్, ఇతర అధికారులు పట్టణంలో బహిరంగసభ నిర్వహించే క్రీడా మైదానానికి సోమవారం సాయంత్రం వచ్చారు. మైదానం విస్తీర్ణం, సభావేదిక ఏర్పాటు ఇతరత్రా అంశాల గురించి స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆర్మూర్ ఏసీపీ అందె రాములు, ఎస్‌హెచ్‌వో రాఘవేందర్, ఎస్సై గంగాధర్‌గౌడ్, తహసీల్దార్ రాణాప్రతాప్‌సింగ్, కాంగ్రెస్ నేతలతో చర్చించారు. వారికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం యానాం గుట్టవద్ద హెలిప్యాడ్‌ను పరిశీలించారు. బహిరంగసభ సమన్వయకర్త మహేష్‌కుమార్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ.శ్రీనివాస్ (చిన్నా), రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, ఆకుల రాఘవేందర్ బహిరంగసభ నిర్వహణ ఏర్పాట్ల గురించి అధికారులతో మాట్లాడారు. వేదిక, రాహుల్‌గాంధీ వచ్చే ప్రవేశమార్గం, వీఐపీ గ్యాలరీ, బారికేడ్ల ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారు.