జిల్లాలో ఘనంగా జరుగుతున్న 75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటాలి : ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 9: స్వతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 08 నుండి 22 వ తేది వరకు నిర్ణయించిన వినూత్న కార్యక్రమాలు జిల్లా లో పెద్దఎత్తున జరువుకోవడం జరుగుతుందని అందులో జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యులు అయి దేశ భక్తిని, జాతీయ భావాన్ని ఘనంగా చాటాలని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈనెల 8వ తేది నుండి 22 వ తేది వరకు చేపట్టబోయే కార్యక్రమంలో పోలీస్ అధికారులు భద్రత ఏర్పాటు చూడటం తో పాటు ఆయా కార్యక్రమాలకు ప్రజలను ప్రోత్సహిస్తూ, కార్యక్రమంలో పాల్గొని వాటిని విజయవంతం చేయడం లో కృషి చేస్తారని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఫ్రీడం రన్ ను జిల్లా కేంద్రంలో స్థానిక కృష్ణవేణి చౌక్ నుండి ఇండోర్ స్టేడియం వరకు జరుగుతుందని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అలాగే గ్రామాలలో ప్రజలు, ప్రజాప్రతినిదులు ఫ్రీడం రన్ ను ఏర్పాటు చేసుకొని పాల్గొనాలని, గ్రామ పోలీస్ అధికారులు కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గొంటారని అన్నారు. ఈ నెల 16 తేది న 10:30 గంటలకు సామూహికంగా జాతీయ గీతాలాపన జరుగుతుందని ఆ రోజు ఉదయం10:30 గంటల లోపు పట్టణాలలో, గ్రామాలలో ప్రజలు ప్రధాన కూడళ్ళ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకోవాలని ,గీతాలాపన చేసే సమయంలో దేవాలయం, మాజిద్, చర్చి ల నుండి సైరన్ మొగుతుందని సైరన్ మోగిన వెంటనే ఇండ్లలో ఉన్నవారు రోడ్ల మీదకు రావాలని, ఆయా పనుల్లో ఉన్నవారు ఎక్కడికక్కడే పనులు ఆపేసి నిలబడి ఉండాలని సైరన్ పూర్తి అయిన వెంటనే జాతీయ గీతం ప్రసారం అవుతుందని ఆ సమయం లో ప్రజలందరూ జాతీయ గీతం పాడి దేశ భక్తిని, జాతీయ భావాన్ని చాటుతూ మహనీయుల త్యాగాలను, స్ఫూర్తిని స్మరిస్తూ భారత కీర్తిని దశ దిశల చాటాలని అన్నారు. వజ్రోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని కార్యక్రమాలలో ప్రజలు, పెద్దలు, విద్యార్థులు స్వచ్చందంగా పాల్గొనాలని అన్నారు. మన పిల్లలకు స్వతంత్ర పోరాటం లో అమరులైన వారి చరిత్రను, వారి పోరాట పటిమను తెలియజేయాలని, రాబోయే తరాల వారికి మన పిల్లలు తెలియజేస్తారని అన్నారు. అలాగే వ్యాసరచన క్రీడలు వక్తృత్వ రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, గద్వాల్,అలంపూర్, శాంతినగర్ సి. ఐ లు చంద్రశేఖర్, సూర్యనాయక్, శివ శంకర్, డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఆర్ ఐ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.