జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.
పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు26(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా పారిశ్రామికరంగంలో అభివద్ధి చెందడానికి అధికారులంతా సమన్వయంతో సహకరించాలని జిల్లా కలెక్టరు పి. ఉదయ్ కుమార్ సూచించారు. శుక్రవారం పరిశ్రమల అభివద్ధిపై క్యాంపు కార్యాలయ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టరు సూచించారు.జిల్లాలో నూతనంగా 86 సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపనకు 4 కోట్ల రూపాయల ప్రభుత్వ రాయితీ మంజూరుకై అనుమతులకు జిల్లా కలెక్టరు ఆమోద ముద్ర వేశారు.ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో టీఎస్ ఐపాస్ ద్వారా 217 యూనిట్లకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖల నుండి 592 పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.
జిల్లాలో 12 భారీ తరహా పరిశ్రమలు నడుస్తుండగా,యం.ఎస్.యం.ఇ క్రింద 759 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ద్వారా 245 కోట్ల పెట్టుబడితో 3,732 మందికి ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను మరింత ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పెట్టిందన్నారు. పెట్టుబడి వ్యయంలో 45 శాతం ప్రభుత్వమే ప్రోత్సాహకాలుగా అందిస్తుందన్నారు. మహిళలకు అధిక రాయితీలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పారిశ్రామిక రంగంలో మరింత ముందుకు సాగడానికి మీ అనుభవాలను పంచుకోవాల న్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంతోపాటు యువతీ యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి స్పూర్తినింపాలన్నారు. నూతన పరిశ్రమల స్థాపనకు, ప్రభుత్వం కల్పించే ప్యాకేజీలు అర్హులకు చేరేలా అధికారులు సహకరించా లని ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి టి. హనుమంతు, జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారిని రమాదేవి, ఆర్టీవో ఎర్రి స్వామి, డిపిఓ కృష్ణ, ఐపీఓ భాస్కర్ రెడ్డి, డిఈ ఎలక్ట్రికల్ రవికుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.