జిల్లా కేంద్రం లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం 2కె రన్
పాల్గొన్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా రాజేశ్వరి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,
నల్గొండ బ్యూరో. జనం సాక్షి ఎంతోమంది ప్రాణత్యాగంతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బ్రిటిష్ పాలనలో దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, కష్టాలను గమనించిన మహనీయులు.. ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించడానికి తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు.
భారత దేశ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా గురువారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో టూ కే ఫ్రీడం రన్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు జరిగిన ఈ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా రాజేశ్వరి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతీయ జెండాలను చేబూని 2కె రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి చరిత్రను ప్రస్తుత తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వాతంత్ర పోరాట చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 15 రోజులపాటు జరిగే వేడుకలలో భాగంగా రకరకాల కార్యక్రమాలతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, అందులో భాగంగానే నేడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మహాత్మా గాంధీ శాంతియుత పద్ధతుల్లో పోరాటం నిర్వహించి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని,నేడు దేశంలో ప్రజలంతా స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తున్నారంటే అది మహనీయుల త్యాగఫలమేనని అన్నారు.మహనీయుల కన్న కలల ను నిజం చేయాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. వజ్రోత్సవ వేడుకలు ప్రజలందరివనీ, నేను అనే భావనను వదిలేసి మనం అనే భావనతో అందరూ ఈ వేడుకల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందున్నట్లుగా.. వజ్రోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ముందుండాలని అన్నారు. 15 రోజులపాటు జరిగే వజ్రోత్సవ వేడుకల రోజువారి కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని.. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ పరిధిలో ఆయా కార్యక్రమాలపై ప్రజలకు సమాచారం అందించి అవగాహన కలిగించాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ అద్భుతంగా సాగిందని, బాగా నిర్వహించారంటూ పోలీస్ శాఖను అభినందించారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణ రాష్ట్రంలో గాంధీ సినిమాను ప్రదర్శించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నల్గొండ జిల్లాలో 16 థియేటర్లలో గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుందని, అన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులు ఈ సినిమాను చూసేలా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఈ సినిమాను చూసేలా ప్రోత్సహించాలని కోరారు. ఈనెల 12న రాఖీ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం ఉండడంతో ఆరోజు కేబుల్ టీవీ చానల్స్ లో దేశభక్తిని పెంపొందించేలా సినిమాలు ప్రదర్శించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ వాటిని వీక్షించాలని కోరారు. 13న ప్రతి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, ప్ల కార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ముందుకు సాగాలని తెలిపారు. 14న నియోజకవర్గం కేంద్రాల్లో జానపద కళాకారులచే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 15 న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 16న ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉంటుందని, ఐదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఇదేవిధంగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రోజువారి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ, 2 కే రన్ లో అందరూ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే గొప్పదనే సందేశాన్ని అందరికీ తెలియజేశామని, ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు పాలడుగు నాగార్జున, సలీం, దండంపల్లి సత్తయ్య, సయ్యద్ హాషం,తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి, బిజెపి రాష్ట్ర నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి ,ఆ పార్టీ నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు,పోలీస్ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.