జీఎస్టీ డే వేడుకలు నిర్వహించనున్న కేంద్రం

– జీఎస్టీ అమల్లోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి
న్యూఢిల్లీ, జూన్‌30(జ‌నం సాక్షి) : ‘ఒకే దేశం- ఒకే పన్ను’ నినాదంతో ఆవిష్కృతమైన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా జులై 1వ తేదీని ‘జీఎస్‌టీ డే’గా ప్రభుత్వం జరపనుంది. ఆదివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జీఎస్‌టీ డే వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్‌ గోయల్‌ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. జీఎస్‌టీ రాకతో దాదాపు 500 రకాల పన్నులు ఒకే పన్నుగా అవతరించాయి. పార్లమెంటు సెంట్రల్‌ హాలు సాక్షిగా గతేడాది జూన్‌ 30 అర్ధరాత్రి 12 గంటలకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ చేతుల విూదుగా జీఎస్‌టీ ఆవిష్కృతమైంది. జీఎస్‌టీ అనేది భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో అతిపెద్ద సంస్కరణగా ప్రణబ్‌ కొనియాడారు. జీఎస్‌టీ ప్రకారం నాలుగు శ్లాబుల కింద పన్నులను వసూలు చేస్తున్నారు. పలు వస్తువులపై 5?, 12?, 18?, 28? పన్నులను వసూలు చేయడం జరుగుతోంది. వినియోగదారులకు పన్ను భారం తగ్గించేందుకు జీఎస్‌టీ నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు సమావేశమవుతోంది. పలు వస్తువులను తక్కువ పన్ను రేటు ఉన్న శ్లాబులోకి మారుస్తూ వస్తోంది.