జీఎస్‌టీకి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

3

– అమల్లోకి వచ్చిన వస్తుసేవల బిల్లు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభలతో పాటు ఇప్పటికే 16 రాష్ట్రాలు కూడా ఆమోదించడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా దీనిపై సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టరూపం దాల్చినట్లయింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉండడం, రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో.. కనీసం సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లే, 16 రాష్ట్రాఉల  ఆమోదం తెలిపాయి. ఆగస్టు నెలలోనే లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తాజాగా ఎపి కూడా దీనిని ఆమోదించింది. మొత్తంగా జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దేశంలోని సంక్లిష్ట పరోక్ష పన్ను వ్యవస్థను జీఎస్టీ సరళీకృతం చేయనుంది. దీనివల్ల దేశమంతా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది. ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బిల్లును గతేడాదే లోక్‌సభ ఆమోదించినా.. రాజ్యసభలో పెండింగ్‌ పడుతూ వచ్చింది. చివరికి కాంగ్రెస్‌తో చర్చలు జరిపిన కేంద్రం.. ఆ పార్టీ సూచించిన కీలక సవరణలకు ఓకే చెప్పడంతో ఆగస్ట్‌లో రాజ్యసభ కూడా జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.