జీవన్‌ రెడ్డి ఓటమే లక్ష్యంగా కవిత ప్రచారం

అభివృద్దిని అడ్డుకున్నారంటూ ఆరోపణలు

కాంగ్రెస్‌ సీనియర్‌కు చెక్‌ పెట్టేందుకు వ్యూహం

జగిత్యాల,సెప్టెంబర్‌22(జ‌నంసాక్షి ): నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న జగిత్యాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించేలా, ఇక్కడి నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవిన్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఎంపి కవిత పావులు కదుపుతున్నారు. ఆమె ప్రచారం చేపట్టిన తరవాత కేవలం జగిత్యాలపైనే ఎక్కువగా నజర్‌. పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి జగిత్యాలలో ఘన విజయం అందించడమే కేసీఆర్‌కు ప్రజలిచ్చే కానుకని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె నేరుగా ప్రచారంలోకి దిగారు. ఇప్పటి వరకు ఆమె తన ఎంపి నియోజకవర్గంలో ఉన్న జగిత్యాలకే ప్రాధాన్యం ఇవ్వడం వెనక జీవన్‌రెడ్డిని ఓడించాలనే లక్ష్యం కనిపిస్తోంది. ఇకపోతే కాంగ్రెస్‌ ప్రముకలును ఓడించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్లాన్‌ సిద్దం చేసుకుంది. అందులో జీవన్‌ రెడ్డి జగిత్యాల సీటు కూడా ఉంది. అందుకే జగిత్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తామని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. . జగిత్యాల చరిత్రలో ఏనాడూ మంజూరు కానన్ని నిధులను 2014 తర్వాత మంజూరు చేశామనీ, జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలోనే రూ.50కోట్లు కేటాయించామనీ, మరో రూ.50కోట్లతో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారనీ, వాటి మంజూరు బాధ్యతలు ఎమ్మెల్యేలకే అప్పగించారరనీ, జగిత్యాలకు మొదటి, రెండో దశలో 1400 ఇండ్లు మంజూ రు చేశారని చెప్పారు. జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కేవలం 400 ఇండ్లను మాత్రమే మంజూరు చేశారనీ, రెండో దశలో ఇచ్చిన 1000 ఇండ్లకు మంజూరే ఇవ్వలేదని చెప్పారు. ఇచ్చిన 400 ఇండ్ల మంజూరు సైతం భూ పంచాయితీలు ఉన్న చోట ఉన్నాయనీ, దీంతో నిర్మాణాలు చేపట్టలేని

పరిస్థితి నెలకొందని చెబుతూ జీవన్‌రెడ్డిని విమర్వించే పనిలో పడ్డారు. డబుల్‌ ఇళ్లకు ఆయన మోకాలడ్డుతున్నారన్న సంకేతాలు ఇచ్చారు. పొ ద్దున లేస్తే సీఎం కేసీఆర్‌ను, ఎంపీ కవితను తిట్టిపోసే జీవన్‌రెడ్డి, పేదల గురించి ఆలోచించడం లేదన్న ప్రచారం చేస్తున్నారు. సీఎంను తిట్టినా ఫర్వాలేదనీ, పేదల అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకోవడం మాత్రం సరికాదంటూ సెంటిమెంట్‌ రిగిలిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ

అనుభవం ఉన్న జీవన్‌రెడ్డి, అభివృద్ధి విషయంలో సరైన వైఖరి అవలంబించడం లేదన్నారు. ఆయన అభివృద్ధిని అడ్డుకోవడాన్ని గమనించి, ఇతర మార్గాల ద్వారా అభివృద్ధికి ప్రయత్నించామనీ, డబుల్‌ బెడ్‌ రూంల మంజూరులో జీవన్‌రెడ్డి వైఖరిలో మార్పురాకపోవడంతో సీఎం కేసీఆర్‌ను కలిసి, జగిత్యాలకు 4వేల ఇండ్లు ఇవ్వాలని కోరామనీ, దీంతో సీఎం స్పందించి రూ.212 కోట్లతో 4,160 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను జగిత్యాలకు కేటాయించారని గుర్తుచేశారు. వీటికి టెండర్లు పూర్తయి 1500 ఇండ్లు సైతం రూపుదిద్దు కున్నాయనీ, వచ్చే డిసెంబర్‌లో లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని కాంగ్రెస్‌ చెప్పుకుంటున్నదనీ వాటిలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు గత ప్రభుత్వం రూ.9వేల కోట్ల బకాయిలు పెట్టిపోయిందనీ, వాటిని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ విడుదల చేశారని చెప్పారు. గతంలో బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేశామనీ, ఇందులో అత్తకోడళ్ల మధ్య వివాదం వస్తే సీఎం కేసీఆరే పరిష్కరించారన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ సర్కారును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు మహాకూటమిగా ముందుకు వస్తున్నాయనీ ప్రజలు ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయించుకోవాలని పేర్కొంటున్నారు. బీడీ కార్మికులకు పింఛన్లు, రైతుబీమా, రైతుబంధు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, ఆసరా పింఛన్లు ఇవన్నీ రావాలంటే కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనన్నారు. అందరి దీవెనలు ఈ ఎన్నికల్లో తమకు ఉంటాయనీ, ఉండాలని ఎంపీ కవిత ఆకాంక్షించారు. జగిత్యాలలో అభివృద్ధికి నిరంతరం అడ్డం పడుతున్న జీవన్‌రెడ్డిని కాకుండా, సీఎం కేసీఆర్‌కు మద్దతు పలుకుతూ, అభివృద్ధికి నిరంతరం అండగా ఉండే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు.