జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పునర్విభజన హైకోర్టుకు..
` సవాల్ చేస్తూ రాంనగర్ వాసి పిటిషన్
` నేడు విచారణ జరపనున్న ధర్మాసనం
హైదరాబాద్(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్‌కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాంనగర్ డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం మంగలశారం వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. జీహెచ్‌ఎంసీ డివిజన్ల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపిస్తూ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ వినతి పత్రం అందజేశారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని కోరారు. జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పునర్విభజనకు ఆదేశాలిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగరాన్ని 300 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్లకు హద్దులను ప్రకటిస్తూ కొన్నిరోజుల క్రితం ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. గతంలోని డివిజన్లతో పోలిస్తే పాత జీహెచ్‌ఎంసీలోని డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. దీంతో జీహెచ్‌ఎంసీలో పునర్విభజన పక్రియపై అభ్యంతరాలు పోటెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి విపక్షాలు, కాలనీ సంఘాలు, స్థానికులు ఇలా అన్ని వర్గాలు తీవ్రంగా సర్కారును తీరును ఎండగడుతున్నాయి. వార్డులోని ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను సమన్వయం చేసుకుని చేపట్టాల్సిన వార్డుల విభజనలో శాస్త్రీయత ఏ మాత్రం పాటించలేదంటూ భగ్గుమంటున్నాయి. 300 వార్డులను విభజించిన అధికారులు గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకువచ్చారని, ఇంత హడావుడిగా విలీనం, వికేంద్రీకరణ పక్రియను చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ పై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ వారం వ్యవధి గడువు తుది దశకు చేరింది. బీఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పునర్విభజన జరుగుతున్న తీరుపై విమర్శించారు. రెండు రోజుల్లో అభ్యంతరాల గడువు ముగియనున్నది. ఇప్పటి వరకు 1328 మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రధానంగా అభ్యంతరాలను 25 వేల ఓటర్లకు మించకుండా వార్డులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వార్డుల పేర్లను మార్చాలని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడం గమనార్హం. జీహెచ్‌ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ పై ఈ నెల 16న జరగనున్న కౌన్సిల్‌లో బలంగా గళం విన్పించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.. వార్డుల పునర్విభజనపై జీహెచ్‌ఎంసీ అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తుండగా, ఇప్పటికే పలువురు మేయర్‌ను కలిసి పునర్విభజన అశాస్త్రీయంగా, ఒక వర్గానికి రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చేలా జరుగుతున్నదని ఆరోపించారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ సమావేశంలో కూడా పునర్విభజనపై నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన వేళ మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఏ ప్రాతిపదికన పునర్విభజన చేశారు?
` జీహెచ్‌ఎంసీ మేయర్‌తో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల భేటీ
హైదరాబాద్(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో కలిసి కార్పొరేటర్లు మేయర్‌ను కలిశారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై ఆమెతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఏ ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన చేశారో చెప్పాలని కోరామన్నారు.బృహత్ హైదరాబాద్‌లో డివిజన్ల పునర్విభజనకు ఆదేశాలిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరాన్ని 300 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్లకు హద్దులను ప్రకటిస్తూ కొన్నిరోజుల క్రితం ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. గతంలోని డివిజన్లతో పోలిస్తే పాత జీహెచ్‌ఎంసీలోని డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యాయి. కొన్నిచోట్ల హద్దులు, కొత్త డివిజన్లపై జీహెచ్‌ఎంసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ను కలిశారు.
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన సరికాదు: తలసాని
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై భారత రాష్ట్ర సమితి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజన ముసాయిదాలో లోపాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో పలువురు పార్టీ నేతలు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్లి.. కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ల పునర్విభజనలో తప్పిదాలను సరి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ డివిజన్ల విభజన గందరగోళంగా చేశారని విమర్శించారు. డివిజన్ల పునర్విభజనలో తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా డివిజన్లు విభజించడం తప్పు అని అన్నారు.
అభ్యంతరాల వెల్లువ..
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల శివారు ప్రాంతాలను విలీనం చేయడంతో 300 వార్డులు ఏర్పాడ్డాయి. అయితే దీనిపై అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ కౌన్సిల్‌లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకోనున్నారు. తద్వారా వార్డలు పనుర్విభజన ఏమైనా ఉంటే చేస్తారు. ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు అధికారులు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపడానికి జీహెచ్‌ఎంసీకి క్యూ కట్టారు నగర ఎమ్మెల్యేలు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశం అయ్యారు. వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా చేయాలంటూ మేయర్‌కు వినతిపత్రం ఇచ్చారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలవనున్నారు. నగర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపనున్నారు. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వార్డుల విభజనపై తమకు కన్ఫ్యూజన్ ఉందని తెలిపారు. డీ లిమిటేషన్‌పై అభ్యంతరం తెలపడానికి కమిషనర్‌ను కలిశామని వెల్లడిరచారు. కనీసం తమకు సమాచారం లేకుండానే, ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండానే డీ లిమిటేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్‌పై కార్పొరేటర్లలో ఆవేదన ఉందని చెప్పుకొచ్చారు. తమ అభ్యంతరాలు మేయర్, కమిషనర్‌కి లిఖిత పూర్వకంగా ఇచ్చామని వివరించారు. జీహెచ్‌ఎంసీ విస్తరణ జరగడం బాగుందని.. కానీ తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని… వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.డివిజన్ల విభజనపై ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. కొన్ని డివిజన్‌లలో ఎక్కువ ఓట్లు మరికొన్ని డివిజన్‌లలో తక్కువ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రతి విషయాన్ని మేయర్, కమిషనర్‌లకు వివరించామని అన్నారు. కౌన్సిల్‌లో అభ్యంతరాలపై వివరంగా చర్చిస్తామని తెలిపారు. వార్డులు మార్పు చేయడానికి ఏం అవకాశం ఉందో గుర్తించాలని అన్నారు. హద్దులు తెలియకుండా అధికారులు వాటిని ఖరారు చేశారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు.


