జులై 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు 

– ప్రతిపక్ష నేతలకు సమాధానాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
– అవిశ్వాసం తీర్మానం వచ్చినా చర్చకు సిద్ధమే
– పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌
న్యూఢిల్లీ, జూన్‌25(జ‌నం సాక్షి ) : జులై 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం అనంత్‌కుమార్‌ అధ్యక్షతన పార్లమెంట్‌ కేబినెట్‌ వ్యవహారాల ఉపసంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలను ఉపసంఘం ఖరారు చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు 18 రోజుల పాటు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా సమావేశాల తేదీలను ఖరారు చేసినట్లు కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ వెల్లడించారు.  నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసస్‌కు రాజ్యాంగ¬దా ఇచ్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశ పెట్టే అవకాశముంది. అదేవిధంగా ఓబీసీ, మెడికల్‌, ట్రిపుల్‌ తలాక్‌, వినియోగదారుల రక్షణ, తప్పనిసరి విద్య ఎన్‌సీఈఆర్‌టీ, ట్రాన్స్‌జెండర్‌ వంటి బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉందని అనంత్‌ కుమార్‌ తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనంత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం వచ్చినా దానిపై కూడా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.